అభివృద్ధే తమ బడ్జెట్ వెనుకున్న ప్రధాన అజెండా : ప్రధాని మోదీ

జీ న్యూస్ ఛానెల్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ..

Last Updated : Jan 20, 2018, 06:05 PM IST
అభివృద్ధే తమ బడ్జెట్ వెనుకున్న ప్రధాన అజెండా : ప్రధాని మోదీ

తమ ప్రభుత్వం తీసుకొస్తున్న బడ్జెట్ వెనుకున్న ప్రధానమైన అజెండా దేశాభివృద్ధేనని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం రాత్రి జీ న్యూస్ ఛానెల్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూలో జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరి అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ వెనుక తమ సర్కారుకి వున్న ప్రధానమైన అజెండా కేవలం అభివృద్ధి మాత్రమే. ఆ అభివృద్ధి ఎలా వుండనుందో రానున్న కాలంలో ప్రజలే చూస్తారు అని అన్నారు మోదీ. 

2019 ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం తీసుకురానున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ఓటర్లకు గాలం వేసే విధంగా వుంటుందా లేక మోదీ సర్కార్ నుంచి ఇంకా ఏమైనా కఠినమైన నిర్ణయాలు వెలువడుతాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొని వుంది. ఇదేకాకుండా నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను బిల్లు లాంటి సరికొత్త ప్రయోగాలు, కఠినమైన నిర్ణయాలు తర్వాత ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వెలువడనున్న వార్షిక నివేదికపై సైతం ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడు ఓ కన్నేసిపెట్టారు. 

► CLICK HERE TO WATCH PM MODI`s INTERVIEW VIDEO 

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయాలపై ప్రజల్లో వున్న అనేకానేక సందేహాలని ప్రజల తరపున మోదీనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది జీ న్యూస్. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల గురించి మోదీ స్పందిస్తూ.. "కేవలం పై అంశాల ప్రామాణికంగానే గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతను అంచనా వేయొద్దు" అని అన్నారు. "బ్యాంకుల జాతియీకరణ తర్వాత 30-40 శాతం జనాభాకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సంబంధాలు తెగిపోయాయి. తమ ప్రభుత్వం మళ్లీ వారిని బ్యాంకింగ్ రంగానికి చేరువ చేసింది. అందులో వారిని భాగస్వాములని చేసింది. అటువంటప్పుడు అది విజయం కాదా" అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. " పాఠశాల ప్రాంగణాలలో మరుగుదొడ్లు లేని కారణంగా వేల మంది ఆడ పిల్లలు చదువుకు దూరమయ్యారు. తమ సర్కారు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించి, అన్ని సౌకర్యాలు సమకూర్చింది. అది ప్రభుత్వం సాధించిన విజయం కాదా" అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు:
ఒక లాజిక్ ప్రకారం చెప్పాలంటే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, వివిధ తేదీలలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖజానాపై ఆర్థికంగా ఎంతో భారం పడుతోంది. అంతేకాకుండా అందుకోసం ఎంతో శ్రమ, మానవ వనరులను వెచ్చించాల్సి వస్తోంది. ఒకవేళ దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరిపినట్టయితే, అన్నివిధాల జరుగుతున్న వృధా కాస్తా ఆదా అవుతుందని అన్నారు ప్రధాని మోదీ. 

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జీ న్యూస్‌కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ''సామాన్యుడి కళ్లలో సంతృప్తిని చూసిన ప్రతీసారి, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే శక్తి తనకు లభిస్తుంది'' అని అన్నారు. 

Trending News