వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఇవే..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  వీవీ ప్యాట్ మెషీన్ లలోని స్లిప్ లను లెక్కింపు చేసేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు రూపొందించింది

Last Updated : Apr 30, 2019, 10:26 AM IST
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఇవే..

ఈవీఎంలో నమోదైన వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు అవగాహన కల్పించనుంది.  కౌంటింగ్ లోపే లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లెక్కించాల్సిన  ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ పద్దతిలో తొలుత ఎంపిక చేస్తారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈవీఎంలలోనూ పోలైన ఓట్లను లెక్కించిన తరువాత వీవీ ప్యాట్ లను బయటకు తీస్తారు. సదరు పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్ లను సరిపోలుస్తారు.

తొలుత స్లిప్ లను ఆయా పార్టీలకు సంబంధించిన ఏజంట్ల ముందు బయటకు తీసి అభ్యర్థుల వారీగా వేరు చేసి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. నియోజకవర్గానికి కేవలం ఐదు యంత్రాల్లోని స్లిప్ లను మాత్రమే లెక్కబెట్టాల్సి వుండటంతో ఐదు వీవీప్యాట్ లనూ ఒకేసారి తెరవనున్నారు. ఈవీఎంలను లెక్కించే టేబుల్ పైనే ట్రేలను ఏర్పాటు చేసి వాటిల్లోనే చీటీలను వేసి లెక్కించాల్సివుంటుంది.

ఈ క్రమంలో ప్రతి లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి కాబట్టి.. ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి మొత్తం 35 వీవీ ప్యాట్ మెషీన్లను లెక్కించాల్సివుంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 2 గంటలకు పైగా సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. 

ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఐదు వీవీ ప్యాట్ మెషీన్ లలోని స్లిప్ లను లెక్కించి సరిచూడాలని సుప్రీంకోర్టు ఆదేశింంచింది. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ లోని స్లిప్పుల లెక్కింపుపై ఈసీ  ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

Trending News