రేప్‌లను రాముడు కూడా ఆపలేడు: బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరీయా జిల్లా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jul 8, 2018, 06:17 PM IST
రేప్‌లను రాముడు కూడా ఆపలేడు: బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరీయా జిల్లా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న అత్యాచార సంఘటనలను రాముడు వచ్చినా ఆపలేడని అన్నారు.

"రాముడు వచ్చినా రేప్‌లను ఆపలేడని పూర్తి విశ్వాసంతో నేను చెప్పగలను. ఎందుకుంటే మారుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. మన ప్రవర్తనలో మార్పు వచ్చినా, కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితిని మార్చలేము. ఇది నా కుటుంబం.. నా సోదరి అని ప్రజలు అనుకోవాలి. కేవలం విలువల ద్వారా మాత్రమే ఈ పరిస్థితిని అరికట్టగలం" అని ఉత్తర్‌ప్రదేశ్‌‌లో పెరుగుతున్న అత్యాచార సంఘటనల గురించి అడిగినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ అన్నారు.

సురేంద్ర సింగ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమీ కాదు. ఆయన గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'వేశ్యలు డబ్బు తీసుకుని సుఖపెడతారు.. ప్రభుత్వ ఉద్యోగులు పైసలు తీసుకుని పనులు చేయరు' అని, పెరుగుతున్న రేప్ సంఘటనలకు తల్లిదండ్రులు, స్మార్ట్ ఫోన్లు కారణమని నిందించారు. మమతా బెనర్జీ సుర్ఫనఖ అని, మోదీ రాముడు అని ఆయన గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల సీతాపూర్ జైలులో ఉన్నవొ అత్యాచార కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు మద్దతు కూడా ఇచ్చారు. ముగ్గురు పిల్లల తల్లిని ఎవ్వరూ అత్యాచారం చేయరని సింగ్ చెప్పారు. "నేను మానసిక దృక్పథం అనే కోణం నుంచి మాట్లాడుతున్నాను. ముగ్గురు పిల్లల తల్లిని ఎవ్వరూ అత్యాచారం చేయరు. ఇది జరగదు కూడా. అతని (కుల్దీప్ సింగ్ సేంగర్) మీద కావాలనే ఎవరో కుట్ర పన్నారు" అని ఆయన ఏఎన్ఐకి చెప్పారు.

అటు శనివారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నవొలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తండ్రి మృతి కేసులో ఐదుగురు నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Trending News