కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అప్పుడే కరోనా వైరస్ లొంగి వస్తుందని పేర్కొన్నారు.
'కరోనా వైరస్'ను పారదోలే యుద్ధంలో ప్రజలే భాగస్వామ్యులుగా ఉన్నారని తెలిపారు. భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు కలిసి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ వైపు మహమ్మారి ప్రాణాలు హరించి వేస్తున్నా దేశానికి వెన్నెముకలా ఉన్న అన్నదాతలు మొక్కవోని ధైర్యంతో పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని రైతన్నలు చేస్తున్న కృషికి ప్రధాని హ్యాట్సాఫ్ తెలిపారు. అన్నదాతలే కాదు.. ఎవరికి వారు తమదైన శైలిలో కరోనా మహమ్మారితో పోరాటంలో భాగస్వామ్యమయ్యారని వివరించారు. చిన్న చిన్న దుకాణదారులకు.. వారు షాపుల యజమానులు వీలైనంత వరకు అద్దెలు మాఫీ చేశారని పేర్కొన్నారు. స్కూల్ క్వారంటైన్లలో ఉంటున్న వలస కార్మికులు.. ఆ పాఠశాలలకు రంగులు వేయడం ఎంతో స్ఫూర్తినిస్తోందని తెలిపారు.
'కరోనా వైరస్' కారణంగా ఓ మంచి కూడా జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా బాహుళ్యంలో ఉమ్మి వేస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో చాలా మందికి అవగాహన వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా జనం తిరిగే ప్రదేశాల్లో ఉమ్మి వేసే అలవాటును మానుకోవాలని సూచించారు. ఇది అందరికీ మంచి చేస్తుందన్నారు. ప్రజారోగ్యం బాగుండాలంటే .. పరిసరాల శుభ్రతను పాటించాలని కోరారు.
కరోనా వైరస్ మహమ్మారిపై నిరంతరం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆలాగే వారిపై దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్ తీసుకువచ్చామని తెలిపారు. దీనిపై వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.
ప్రతి పౌరుడు ఓ సైనికుడు కావాలి..!!