అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ) అనే ఉగ్రవాద సంస్థ ఎప్పుడు అవకాశం చిక్కితే అప్పుడు భారత్‌లో విధ్వంసం సృష్టిద్దామా అన్నట్టుగా కాచుకు కూర్చుని వుంది. ఇండియాలో చలామణిలో వున్న వివిధ ఐడీ కార్డులకు ఫేక్ ఐడీ కార్డ్సు సృష్టించుకుని, వాటితో దేశం నలుమూలలా తిరిగే ఉగ్రవాదులుగా ఈ సంస్థకు చెందిన వారికి ఇప్పటికే పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా జీ మీడియా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అక్రమంగా భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు, ఏబీటీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోన్న ఉగ్రవాదులు నకిలీ ఐడీ కార్డ్సు ఆధారంగానే దేశంలో తరచుగా అడ్డాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ దేశంలో దాడులకు కుట్ర పన్నుతోంది అని ఇప్పటికే మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్వ్కాడ్ (ఏటీఎస్) పోలీసులు సైతం కేంద్రానికి హెచ్చరికలు జారీచేశారు.
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి వున్న కేసులో ఇటీవల పూణె, మహద్, అంబర్నాథ్ ప్రాంతాల నుంచి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా అలా నకిలీ గుర్తింపు కార్డులతో తరచుగా మకాం మారుస్తున్న 24మందికిపైగా బంగ్లాదేశీయులని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన అనంతరం ప్రముఖ జాతీయ న్యూస్ మీడియా దిగ్గజం అయిన జీ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపిన పరిశోధనలో భయంకరమైన వాస్తవాలెన్నో వెలుగుచూశాయి. కేవలం రూ.200 ఇస్తే, ఎటువంటి నకిలీ గుర్తింపు కార్డునైనా క్షణాల్లో తయారు చేసి ఇచ్చే ముఠాలు ముంబైలో అనేకం వున్నాయనే నగ్న సత్యం జీ మీడియా ఇన్వెస్టిగేషన్లో బట్టబయలైంది. ఈ ఫేక్ ఐడీ కార్డులతో రైలు, విమానమార్గాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఎవ్వరికీ, ఎటువంటి అనుమానం రాకుండా ప్రయాణం చేయవచ్చు. వెళ్లిన ప్రతీ చోట ఓ కొత్త పేరుతో పరిచయాలు పెంచుకుని, ఆ పేరుతోనే ఏమైనా చేయొచ్చు కూడా.
జీ మీడియా ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు :
దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు ముంబైలో ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో.. ఆ ప్రాంతానికి (మల్వాని) చేరుకున్న జీ మీడియా బృందం.. అక్కడ అంత తేలిగ్గా వారికి ఆ నకిలీ గుర్తింపు కార్డులు ఎలా లభించాయనే కోణంలో తమ పరిశోధన షురూ చేసింది. మొదటగా ఓ ట్రావెల్ ఏజెంట్‌ని కలిసిన జీ మీడియా బృందం.. అతడి నుంచి రాజేష్ కుమార్ అనే వ్యక్తి పేరుపై ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో రూ.1000 లతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుగోలు చేసింది. అది కూడా ఎంత వేగంగా అంటే.. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే కేవలం 117 సెకన్లలోపే టికెట్ బుకింగ్ పూర్తయింది. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో నిండా రెండు నిమిషాలు కూడా పట్టకుండానే టికెట్ బుక్ చేసి ఇచ్చాడు ఆ ఏజెంట్.
కేవలం టికెట్ బుకింగ్‌తో గేమ్ ముగియలేదు. ఇక్కడే, ఇప్పుడే అసలు ఆట మొదలైంది. ఉదయం వేళ ఆ టికెట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన జీ మీడియా బృందం మళ్లీ సాయంత్రం వేళ అదే ఏజెంట్ దగ్గరికి వెళ్లింది. రాజేష్ కుమార్ ఢిల్లీకి వెళ్లడానికి కుదరడం లేదు. అతడు ముంబైలోనే వుండాల్సిన పని పడింది. అందువల్ల రాజేష్ కుమార్ స్థానంలో మరొకరిని ఢిల్లీకి పంపించడానికి వీలవుతుందా అని అడిగింది. జీ మీడియా ప్రతినిధులని సాధారణ వ్యక్తులుగానే భావించిన సదరు ఏజెంట్.. ఏ మాత్రం ఆలస్యం లేకుండా మరో రూ.200 ఇస్తే, రాజేష్ కుమార్ స్థానంలో ప్రయాణించే మరో వ్యక్తి కోసం రాజేష్ కుమార్ పేరిట ఓ ఫేక్ ఐడీ కార్డు సృష్టించి ఇస్తానని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు.
జీ మీడియా ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన కృష్ణ సింగ్ ఒరిజినల్ ఆధార్ కార్డుని తీసుకుని అతడి పేరు వున్న చోట రాజేష్ కుమార్ పేరుని చేర్చుతూ క్షణాల్లోనే ఓ ఫేక్ ఆధార్ కార్డుని రూపొందించాడు రూ.200 లకు గడ్డి కరిచిన ఆ ఏజెంట్. క్షణాల్లోనే కృష్ణ సింగ్ ఒరిజినల్ ఆధార్ కార్డుతోపాటు రాజేష్ కుమార్ పేరిట రూపొందించిన నకిలీ ఆధార్ కార్డు సైతం జీ మీడియా చేతిలో పడింది. రెండింటిలోనూ ఫోటో ఒక్కటే, ఆధార్ నెంబర్ కూడా ఒక్కటే. కాకపోతే ఒరిజినల్ ఆధార్ కార్డులో కృష్ణ సింగ్ అని వున్నచోటే ఫేక్ ఐడీ కార్డులో రాజేష్ కుమార్ అని వుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్.
రూ.200 కోసం నకిలీ ఐడీ కార్డు రూపొంది ఇచ్చిన ఆ ఏజెంట్ జీ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడండోయ్..!! అదేమంటే.. " ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఈ ఫేక్ ఆధార్ ఐడీ కార్డుని ధ్వంసం చేసి పారేయాలి " అని. కేవలం ప్రయాణం కోసం మాత్రమే ఈ నకిలీ ఆధార్ ఐడీ కార్డుని వినియోగించాల్సిందిగా పలు ముందు జాగ్రత్తలు చెప్పాడు ఆ ఏజెంట్. ఏదేమైతేనేం... ఒక్కసారి ఫేక్ ఐడీ కార్డు చేతిలో పడ్డాకా, దానిని తన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడం అనేది దానిని పొందిన వ్యక్తి చేతుల్లోనే వుంటుందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. నకిలీలు ఎప్పుడూ మంచి కోసం కాకుండా చెడు కోసమే పుట్టుకొస్తాయనే మరో వాస్తవాన్ని కూడా ఇక్కడ అందరూ గుర్తించాలి.