బెంగుళూరులో గతేడాది జరిగిన సీనియర్ మహిళా పాత్రికేయురాలు, సామాజికవేత్త గౌరీ లంకేష్ హత్య కేసులో అనేకమైన విస్తుగొలిపే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పర్శురామ్ వాఘ్‌మరె దర్యాప్తులో పోలీసులకు అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించాడు. ఆమెను తాను డబ్బు కోసం చంపలేదని, ఆమె అభిప్రాయాలు హిందువులకు వ్యతిరేకంగా ఉండటం నచ్చకే ఆమెని హతమార్చానని పర్శురామ్ అంగీకరించినట్టుగా ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సిట్ అధికారుల బృందం తెలిపింది. గౌరీ లంకేష్‌ని హతమార్చినందుకు పర్శురామ్ రూ.13,000 సుపారీ తీసుకున్నాడని సిట్ బృందం తమ ప్రతినిధికి చెప్పినట్టుగా డెక్కన్ క్రానికల్ ఓ కథనంలో పేర్కొంది. డెక్కన్ క్రానికల్ పేర్కొన్న ఆ కథనం ప్రకారం ఆ మొత్తం సుపారీలో రూ.3000 బెంగుళూరులో బస, ఆహారం ఖర్చుల కింద అందచేయగా, మరో రూ.10,000 హత్య అనంతరం అందుకున్నాడు. ఆ తర్వాత అతడు బెంగుళూరు విడిచి తన సొంత గ్రామానికి వెళ్లిపోగా అనంతరం అతడిని ఎవ్వరూ సంప్రదించలేదని సిట్ విచారణలో బట్టబయలైనట్టు సమాచారం.
హత్యకు ముందుగా ఓ వంట సామాన్ల దుకాణంలో పనిచేసిన పర్శురామ్... గౌరీ లంకేష్ హత్య తర్వాత అందులో పనిచేయడం మానేశాడు. ఈ హత్య గురించి అతడు ఎవ్వరితోనూ చర్చించలేదు. చివరకు తన కుటుంబసభ్యులతోనూ అతడు ఈ విషయాన్ని ప్రస్తావించలేదని సిట్ బృందం తెలిపింది.
గౌరీ లంకేష్ హత్య కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు