జీఎస్టీ ఉపయోగం గురించి ప్రజలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.132.38 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటూ జీఎస్టీ ప్రకటనల నిమిత్తం ప్రభుత్వం ఎంత మొత్తం ఖర్చు పెట్టింది అని ప్రశ్నించగా.. ప్రభుత్వం అందుకు సమాధానమిచ్చింది. ప్రింట్ మీడియాలో ప్రకటనల నిమిత్తం రూ.1,26,93,97,121 రూపాయలను ఖర్చు పెట్టినట్లు శాఖ తెలిపింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల నిమిత్తం ఏ విధంగానూ ఖర్చుపెట్టలేదని స్పష్టం చేసింది.
అయితే ఔట్ డోర్ ప్రకటనల కోసం రూ.5,44,35,502 ఖర్చు పెట్టామని తమ వివరణలో శాఖ పేర్కొంది. జులై 1, 2017 నుండి జీఎస్టీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి జీఎస్టీ గురించి ప్రచారం చేయడానికి ప్రభుత్వం వివిధ మార్గాలను ఎంచుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను జీఎస్టీ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ వారు కూడా తాము ఇచ్చే ప్రింట్ మీడియా ప్రకటనల్లో జీఎస్టీ గురించి విపులంగా తెలియజేసేందుకు 50 ప్రశ్నలు, జవాబులను కూడా ప్రచురించడం జరిగింది.
జీఎస్టీ అన్నది భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు, సేవల తయారీ, అమ్మకం, వినియోగాలపై విధిస్తున్న సమగ్రమైన పరోక్ష పన్ను. ఈ పన్ను విధించే నిర్వహణ బాధ్యత సాధారణంగా ఏకైక అధికారి వద్ద ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నాలుగు రకాల పన్నులను నెలకొల్పింది, ఇవి 5, 12, 18 మరియు 28 శాతంగా ఉండడం గమనార్హం.