గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మరికొద్దిగంటల్లో ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. దేశం యావత్తు గుజరాత్ ఎన్నికల రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడం ఒక ఎత్తైతే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు తీసుకున్నాక వెల్లడవుతున్న ఫలితాలు కావడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్లో బీజేపీ పార్టీ వరుసగా ఐదుసార్లు అధికారం చేపట్టింది. ముచ్చటగా ఆరోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. ఇక 20 ఏళ్ల నుండి గుజరాత్లో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.
గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. మోదీ నేతృత్వంలో భాజాపా ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగగా.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం గుజరాత్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేయ్యండని విజ్ఞప్తి చేయగా.. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవటం లేదని విమర్శలు గుప్పించింది. ఎలాగైనా బీజేపీని అధికారంలో నుంచి దించాలని కాంగ్రెస్ పటీదార్లతో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్ళింది.
గుజరాత్లో రెండు దశల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 68.41 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబర్ 9న జరిగిన 89 స్థానాలకు 66.75 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 14వ తేదీ జరిగిన 93 స్థానాలకు 69.99 శాతం నమోదైంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి 2.91 శాతం తగ్గింది.
ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
కాగా డిసెంబర్ 19వ తేదీన (సోమవారం) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే ప్రజలు మరోసారి పట్టం కడుతున్నారని వెల్లడించాయి. అయితే మాదే గెలుపంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. సోమవారం మధ్యాహ్నానికల్లా అధికారంలో ఎవరుంటారో తేలిపోతుంది.
హిమాచల్ ప్రదేశ్ లో..
హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా రేపే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. గెలుపు ఈసారి కూడా తమదే అంటూ అధికార కాంగ్రెస్ చెబుతుండగా.. కాదు తమదే అంటూ బీజేపీ చెబుతున్నది. హిమాచల్‌ప్రదేశ్ లో నవంబర్ 9న ఒకేరోజు 68 స్థానాలకు పోలింగ్ జరిగింది. సుమారు 75.28శాతం ఓటింగ్ నమోదైంది. అయితే హిమాచల్ ఎన్నికల సంప్రదాయం ఒకసారి గమనిస్తే.. అక్కడ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం గమనార్హం. ఆ ప్రకారం చూస్తే, హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తమకు నమ్మకం లేదని కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్ చెబుతున్నారు.