గృహ రుణాలు, వాహనాల రుణాలపై తగ్గనున్న ఈఎంఐ భారం

గృహ రుణాలు, వాహనాల రుణగ్రహీతలకు గుడ్ న్యూస్

Last Updated : Feb 7, 2019, 07:57 PM IST
గృహ రుణాలు, వాహనాల రుణాలపై తగ్గనున్న ఈఎంఐ భారం

న్యూఢిల్లీ: గృహరుణాలు, వాహనాల రుణాలు తీసుకోబోయే వారికి ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఓ గుడ్ న్యూస్ వినిపించింది. బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే రుణాలపై వడ్డీని 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరి పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 6.50 శాతంగా వున్న వడ్డీ రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. ఫలితంగా బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే గృహ, వాహన రుణాలపై సైతం వడ్డీ రేటు, ఈఎంఐ భారం కొంతమేరకు తగ్గనున్నాయి. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానంలో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన శక్తికాంత దాస్ నేతృత్వంలో మానిటరీ పాలసి కమిటీ భేటీ అవడం ఇదే మొదటిసారి. 

వడ్డీ రేటు తగ్గింపు విషయంపై జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు సభ్యులు కలిగిన మానిటరి పాలసీ కమిటీలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సహా మరో సభ్యుడు వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడానికే మొగ్గు చూపగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సహా మరో ముగ్గురు సభ్యులు వడ్డీ రేటు త్గగింపునకు ఓటేశారు. దీంతో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించినట్టయింది.

Trending News