అనాథైన ముస్లిం బాలికను దత్తత తీసుకోవడమే..అతని పాలిట శాపమైంది..!

2007లో హైదరాబాద్‌లో జరిగిన గోకుల్ ఛాట్ బాంబు పేలుడు కేసు ఎంత పెద్ద సంచలనమైందో అందరికీ తెలిసిన విషయమే.

Last Updated : Jun 30, 2018, 12:07 PM IST
అనాథైన ముస్లిం బాలికను దత్తత తీసుకోవడమే..అతని పాలిట శాపమైంది..!

2007లో హైదరాబాద్‌లో జరిగిన గోకుల్ ఛాట్ బాంబు పేలుడు కేసు ఎంత పెద్ద సంచలనమైందో అందరికీ తెలిసిన విషయమే. ఆ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి సానియాని హిందువైన రవికాంత్ దంపతులు దత్తత తీసుకొని పెంచసాగారు. అయితే ఒక ముస్లిం అమ్మాయిని పెంపకానికి తెచ్చుకోవడంతో ఆ దంపతులు చాలా కోల్పోవాల్సి వచ్చింది.

బంధువులతో పాటు స్నేహితులతోనూ చీత్కారాలు ఎదుర్కొన్నారు. అయినా సరే.. తాము పెంపకానికి తెచ్చుకున్న అమ్మాయిని ముస్లింగానే పెంచారు ఆ దంపతులు. ఆమె తనకిష్టమైన మతం ప్రకారం నడుచుకోవచ్చని వారు ఆమెకు తెలిపారు. అయితే ఇటీవలే కాలంలో యుక్తవయసులోకి అడుగుపెట్టిన సానియాకి స్థానికుల నుండి వేధింపులు ఎదురయ్యాయి. తన పెంపుడు కూతురిని వేధిస్తున్న పలువురిని రవికాంత్ పలుమార్లు హెచ్చరించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

ఇటీవలే పదే పదే తమను హెచ్చరిస్తున్న రవికాంత్ పై ఒక ప్లాన్ ప్రకారం దాడిచేశారు దుండగులు. ఆ దాడిలో రవికాంత్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు ఆయన మరణించాడని భావించి విడిచిపెట్టారు. కానీ రవికాంత్ బతికి బయటపడ్డాడు. మూడు రోజుల పాటు ఉస్మానియా ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్న రవికాంత్.. తెలివి వచ్చాక లేచి జరిగిన ఉదంతం గురించి మీడియాకి తెలిపారు. ప్రస్తుతం రవికాంత్ పై దాడికి పాల్పడిన అయిదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Trending News