భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు విదేశీ పర్యటన అవకాశం లభించింది. ఈ ఆవకాశం దక్కించుకున్న మొట్టమొదటి జోన్ గా సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే చరిత్రకెక్కింది. గ్యాంగ్ మెన్, ట్రాక్ మెన్ లతో పాటు మొత్తం 100 మంది ఇతర నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇప్పటికే 6 రోజుల పర్యటన కోసం సింగపూర్, మలేషియాకు వెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే(ఎస్సిఆర్) తెలిపింది.
ఈ పర్యటన ఖర్చులో ఉద్యోగి 25% భరిస్తే చాలు.. మిగితా 75% స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ భరిస్తుందని ఎస్సిఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ సీ, డీ కేటగిరీ ఉద్యోగులు(నాన్-గెజిటెడ్ ఉద్యోగులు)ఈ నెల 28నే సింగపూర్ కు విమానమెక్కారు. పర్యటనలో భాగంగా సింగపూర్ లో యూనివర్సల్ స్టూడియోస్, సెంతోనా, నైట్ సఫారీలతో పాటు మలేషియాలోని కౌలాలంపూర్ సిటీ టూర్, పెట్రోనాస్ టవర్స్, బటు గుహలు, గెంటింగ్ హైలాండ్స్లను చూపించనున్నారు. సాధారణంగా కింది స్థాయి ఉద్యోగుల సంక్షేమం కోసం వారి పిల్లల చదువు, స్కాలర్ షిప్స్ ల కోసం స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ ఉపయోగపడుతుంది. గతేడాది డిసెంబర్ లో సౌత్ సెంట్రల్ రైల్వేస్ విదేశీ టూర్ ప్రతిపాదనను పంపించగా.. జనవరిలో క్లియరెన్స్ రావడంతో వెంటనే నిర్ణయాన్ని అమలుచేశారు.