రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రిపబ్లిక్ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ధనికులు స్వచ్ఛందంగా వివిధ సబ్సీడీలు, రాయితీలు వదులుకున్నట్టయితే, అవి అవసరంలో వున్న మరొకరికి ఉపయోగపడతాయని అన్నారు. యువత గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ.. కేవలం యువతకు మాత్రమే దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తియుక్తులు వున్నాయని స్పష్టంచేశారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం నుంచి కొన్ని ముఖ్యాంశాలు:
> రక్తం, చమట ధారపోసి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకొచ్చిన మహనీయులని స్మరించుకోవాల్సిన రోజే గణతంత్ర దినోత్సవం.
> సైనికులు, డాక్టర్లు, రైతన్నలు, నర్సులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు... ఇలా అన్నిరంగాల వాళ్లు దేశానికి సేవ చేస్తున్నారు.
> దేశ జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ళ లోపు వయసువారే. ఆ యువతే మన దేశానికి భవిష్యత్తు. యువతకు మెరుగైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం అందించే ఆ అవకాశాలని యువత అందిపుచ్చుకోవాలి.
> బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పౌష్టికాహర లోపం ఒకటి. ఈ సమస్య పరిష్కారానికి చాలా కృషి జరుగుతున్నప్పటికీ, చేయవలసింది ఇంకా చాలానే మిగిలి వుంది.
ప్రజలే దేశాభివృద్ధికి మూలస్తంభాలు అని అభిప్రాయపడిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు.