కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డిని సీసీబీ (సెంట్రల్ క్రైం బ్రాంచ్) పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు తన పీఏ అలీఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు గాలి జనార్థనరెడ్డిని సీసీబీ పోలీసులు ఇంటరాగేషన్ చేయడం జరిగింది. "మా వద్ద గాలి జనార్థనరెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే బలమైన సాక్షులు కూడా ఉన్నారు. ఆధారాలతో సహా ఈ కేసుకు సంబంధించిన రిపోర్టును మెజిస్ట్రేట్‌కి అందజేయనున్నాం. సాధ్యమైనంత త్వరగా డబ్బును రికవరీ చేయనున్నాం" అని సెంట్రల్ క్రైం బ్రాంచ్ అడీషనల్ సీపీ అలోక్ కుమార్ తెలిపారు.
పోంజీ స్కామ్‌కి సంబంధించి ఫరీద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకే గాలి జనార్థనరెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం గాలి జనార్థనరెడ్డి ఓ వీడియో మెసేజ్ లీక్ చేసిన సంగతి తెలిసిందే. తాను అందరూ అనుకున్నట్లు ఎక్కడికీ పారిపోలేదని.. తాను తన ఇంటిలోనే ఉన్నానని ఆ మెసేజ్‌లో ఆయన పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనకు వ్యతిరేకంగా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. కేవలం మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం అంబిడెంట్ కంపెనీ తరఫున ఈడీకి లంచం ఇచ్చేందుకు మధ్యవర్తిత్వం నడిపారని గాలి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు నుండి తప్పించుకోవడానికే గాలి శనివారం పరారవ్వడానికి ప్రయత్నించారనీ వార్తలు వచ్చాయి. అయితే మొన్నటి వరకూ ఎవరికీ తెలియని ప్రదేశంలో తలదాచుకున్న గాలి.. తనకు సీసీబీ పోలీసుల నుండి నోటీసులు అందాయని.. కనుక విచారణకు హాజరై వారికి సహకరిస్తానని తెలపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గాలిని విచారించిన పోలీసులు.. ఆయనను అరెస్టు చేయడంతో కథ ఆసక్తికరంగా మారింది.
We have taken the decision to arrest him on the basis of credible evidence and witnesses statements. We will produce him before the magistrate. We are going to recover the money & give it to the investors: Alok Kumar, Additional CP, Central Crime Branch, #Bengaluru pic.twitter.com/0MvDauU8mO
— ANI (@ANI) November 11, 2018