రేప్ చేస్తే.. ప్రజలకు అప్పగించండి: పార్లమెంట్‌లో జయాబచ్చన్ సంచలన వ్యాఖ్యలు

దిశపై సామూహిక అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్న తరుణంలో నేడు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు దద్దరిల్లాయి.

Last Updated : Dec 2, 2019, 05:40 PM IST
రేప్ చేస్తే.. ప్రజలకు అప్పగించండి: పార్లమెంట్‌లో జయాబచ్చన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: దిశపై సామూహిక అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్న తరుణంలో నేడు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు దద్దరిల్లాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోన్న తరహాలోనే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఎంపీలు కూడా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుపట్టారు. కఠిన చట్టాలను అమలు చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కూడా మహిళల, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రజలకు అప్పగించాలని ఆమె సూచించారు. మూకుమ్మడి దాడి చేయడం ద్వారా.. వారికి ప్రజలే శిక్ష విధిస్తారని జయాబచ్చన్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో అత్యాచార ఘటన అంశంపై మాట్లాడే క్రమంలో జయాబచ్చన్.. ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ఇలాంటి విషయాలపై మాట్లాడాల్సి రావడం ఎంతో బాధగా ఉందని గద్గద స్వరంతో అన్నారు. జయబచ్చన్ తన ఆవేదన వ్యక్తంచేసిన తీరు చూస్తే.. హైదరాబాద్‌లో దిశపై జరిగిన అరాచకం అందరిలాగే ఆమెను కూడా ఎంతగానో కదిలించిందని అర్థమవుతోంది.

షాద్ నగర్‌లో దిశపై కామవాంఛ తీర్చుకుని ఆమెను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలించిన సంగతి తెలిసిందే.

Trending News