జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టరుగా పనిచేస్తున్న డాలు సోరేన్.. క్రైస్తవ మత ప్రచారకుడు కూడా. ఇటీవలి కాలంలో ఆయన పలువురు స్కూళ్లు పిల్లలకు డబ్బులిచ్చి మత సమావేశాలకు హాజరయ్యేలా చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో సవన్లాపూర్ ప్రాంతంలో ఓ 13 ఏళ్ల బాలికను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు చర్చిలో ప్రయత్నాలు జరుగుతుండగా.. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాలికను ఈ విషయమై ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ "నేను క్రైస్తవ మతంలోకి మారితే నాకు ఉచిత విద్యను అందించడంతో పాటు కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తారని చెప్పారు" అని తెలిపింది.
దీంతో బలవంత మత మార్పిడులు చేస్తున్నారనే ఆరోపణలపై సోరేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత సోరేన్ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు రూ.500 ఇస్తూ.. వారిని మత సమావేశాలకు హాజరయ్యేలా చూస్తారని.. తర్వాత వారి ప్రోద్బలంతో పిల్లలు మతం మారుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో లిట్టీపారా ప్రాంత పోలీసులు సోరేన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకొనేముందుకు తాము కూలంకషంగా ఎంక్వయరీ కూడా చేయనున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
ప్రసుత్తం ఈ కేసులో నిందితుడైన సోరేన్ పాలమూ జిల్లాలోని చత్రపుర్ ప్రాంతంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టరుగా సేవలందిస్తున్నారు. ఆయన పై కేసు నమోదు చేసిన లిట్టీపారా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇంఛార్జి బిమల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, పిల్లలకు హితవు పలికారు. తమను ఎవరైనా మతమార్పిడి కోసం బలవంతం చేస్తే.. ఇంట్లో పెద్దలతో చెప్పాలని.. అపరిచితుల వద్ద డబ్బులు తీసుకోవద్దని తెలిపారు. ఈ కేసు విషయంలో కూడా రూ.500 తీసుకొని మతం మారడానికి ప్రయత్నించిన బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపించి పలు సూచనలు చేశారు. ఈ కేసులో నిందితుడైన సోరేన్‌కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు తనను రిమాండ్‌కి పంపించాలని పోలీసులను ఆదేశించింది.