ఫేక్ న్యూస్ రాసే జర్నలిస్టుల గుర్తింపు రద్దు: కేంద్రం

తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్‌) శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది.

Last Updated : Apr 3, 2018, 07:47 AM IST
ఫేక్ న్యూస్ రాసే జర్నలిస్టుల గుర్తింపు రద్దు: కేంద్రం

న్యూఢిల్లీ: తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్‌) శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. ఈ మేరకు విలేకర్ల గుర్తింపునకు సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. దీంతో ఫేక్ న్యూస్ ప్రచురించిన/ప్రసారం చేసినట్లు రుజువైతే సంబంధిత విలేకరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు రద్దు చేస్తారు. రెండోసారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు రద్దు చేస్తారు. మూడోసారీ తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలియజేసింది.

నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవయితే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) పరిశీలనకు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించినవయితే న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) పరిశీలనకు పంపిస్తామని తెలిపింది. ఫిర్యాదులపై ఈ సంస్థలు 15 రోజుల్లోగా నిర్ణయాన్ని చెప్తాయని అంది. ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి నిర్ణయం వెలువడేంతవరకు ఆ విలేకరి గుర్తింపును నిలిపివేస్తామని చెప్పింది. ' తప్పుడు వార్త' అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకున్నా.. నిబంధనలు అతిక్రమించే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై చర్యలుంటాయంది. వినియోగదారులకు అభిప్రాయాలు చూపి తప్పుదోవ పట్టించకుండా నైతిక విలువలు పాటించాలని తెలిపింది.

ఇదిలా ఉండగా.. తప్పుడు వార్తలు ప్రచురిస్తే గరిష్ఠంగా ఆరేళ్ల కారాగార శిక్ష విధించడానికి వీలు కల్పించే నూతన చట్టాన్ని మలేసియా పార్లమెంటు దిగువసభ సోమవారం ఆమోదించింది. సుదీర్ఘమైన చర్చతర్వాత అధికార కూటమి దీనికి అనుకూలంగా ఓటువేసింది. ఈ చట్టం స్థానిక ప్రసార మాధ్యమాలతో పాటు విదేశీ మాధ్యమాలకూ వర్తిస్తుంది.

 

Trending News