నేనెంత కాలం బతుకుతానో నాకే తెలియదు : కర్ణాటక సీఎం కుమారస్వామి

కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోగ్యానికి ఏమైంది ?

Last Updated : Oct 27, 2018, 05:42 PM IST
నేనెంత కాలం బతుకుతానో నాకే తెలియదు : కర్ణాటక సీఎం కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి పరోక్షంగా తన ఆరోగ్యం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తానెంత కాలం బతుకుతానో తనకే తెలియదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. "ఎంత కాలం బతికుంటానో తెలియదు కానీ బతికున్నంత కాలం నిరుపేదలకు ఏదో ఒకటి చేసేందుకు మాత్రం తీవ్రంగా కృషి చేస్తాను" అని కుమారస్వామి అన్నారు. గతేడాది ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడే తాను అయిపోయానని అనుకున్నానని, తాను అంత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కున్నానని కుమారస్వామి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మాండ్య జిల్లా మాలవల్లిలో ఓ ర్యాలీకి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ కుమారస్వామిఈ వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. 

కుమారస్వామి ప్రసంగంపై ప్రధాన ప్రతిపక్షనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన బీఎస్ యెడ్యూరప్ప స్పందిస్తూ.. కుమారస్వామి తన సొంత ఆరోగ్యం గురించి ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు చేయడం మానేసి, ఇకనైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారిస్తే బాగుంటుందని హితవు పలికారు. మద్దూరులో జరిగిన ఓ సభలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ యెడ్యూరప్ప ఈ విమర్శలు చేశారు. 

గతేడాది ఇజ్రాయెల్ పర్యటనలో ఉండగా కుమారస్వామికి గుండెపోటు వచ్చిందని, అతడికి గుండెపోటు రావడం అది రెండోసారి అని పార్టీ వర్గాలు తెలిపాయి. కాకపోతే ఈ విషయాన్ని పార్టీలోని కొంతమంది కీలకనేతలు, కుమారస్వామి కుటుంబసభ్యులకు మినహాయించి బయటికి పొక్కనివ్వలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Trending News