కర్నాటక సంక్షోభం: ఏకైక  బీఎస్పీ ఎమ్మెల్యేపై మాయావతి కొరడా

 బెహన్ జీ కి కోపం వచ్చింది.. ఉన్నది ఒక్క ఎమ్మెల్యే అయినప్పటీ క్షమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేశారు

Last Updated : Jul 24, 2019, 11:45 AM IST
కర్నాటక సంక్షోభం: ఏకైక  బీఎస్పీ ఎమ్మెల్యేపై మాయావతి కొరడా

కర్ణాటక  అసెంబ్లీలో ప్రాధినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే మహేష్ ను ఆ పార్టీ చీఫ్ మాయావతి  పార్టీ నుంచి  బహిష్కరించారు. విశ్వాస పరీక్ష సమయంలో  సభకు హాజరు కాకుండా పార్టీ ఆదేశాలను విరుద్ధంగా ప్రవర్తించారని ఆగ్రహించిన బెహన్ జీ  ఈ మేరకు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

విశ్వాస పరీక్ష సమయంలో కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని బీఎస్పీ  నిర్ణయించింది. అందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే మహేష్  పార్టీ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఆయన గైర్హాజరయ్యారు.  దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకమాండ్‌ ఆయనపై వేటు వేసింది. ట్విట్టర్ వేదికగా మాయావతి స్పందిస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ ను  తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని  మాయావతి పేర్కొన్నారు.

కుమారస్వామి నాయకత్వంలో నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలో మాయావతి కోరిక మేరకు తన మంత్రివర్గంలో మహేశ్‌ కు స్థానం కల్పించారు. అయితే కొన్ని కారణాల వల్ల గత ఏడాది  అక్టోబర్‌ లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ  సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్షలో ఓటింగ్ కు హాజరుకాకుండా అందరికీ షాక్ కు గురిచేశారు.

ఫలితంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం స్వల్ప  (నాలుగు) ఓట్ల తేడాతో మెజార్టీ నిరూపించలేకపోయింది. మేజిక్ 103గా నిర్ణయించగా కుమారస్వామి సర్కార్ కు అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు పోలయ్యారు. ఫలితంగా  కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

Trending News