ముంబై: కన్నడనాట రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకనపడుతోంది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ముంబైలోని రెనిసన్స్ హోటల్‌కు మకాం మార్చిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆయా పార్టీల అగ్రనేతల మాటలను బేఖాతరు చేస్తుండటంతో పరిస్థితి మరింత చేయిదాటిపోయేలా కనిపిస్తోంది. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ముంబైలోని రెనిసన్స్ హోటల్‌కి చేరుకున్నారు. అయితే, డికే శివకుమార్‌ని కలిసేందుకు సిద్ధంగా లేని అసమ్మతి ఎమ్మెల్యేలు ముందుగానే మహారాష్ట్ర పోలీసులకు విజ్ఞప్తి చేసి హోటల్ చుట్టూ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కర్ణాటక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు రెనిసన్స్ హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు శివకుమార్‌ని లోపలికి అనుమతించడం లేదు.
హోటల్లో అసమ్మతి ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చి భంగపడిన కర్ణాటక మంత్రి డికే శివకుమార్ సైతం వారిని కలవందే తాను వెనక్కి తిరిగి వెళ్లేది లేదంటూ బీష్మించుకుకూర్చున్నారు. వారు(అసమ్మతి ఎమ్మెల్యేలు) చాలా ఆవేదనతో ఉన్నారని, వారే తనను పిలుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే తాను వారితో టచ్‌లో ఉన్నానని, తమది అంతా ఒక్క కుటుంబమేనని అన్నారు. రాజకీయాల్లో కలిసే పుట్టాం.. కలిసే చచ్చిపోతాం అంటూ శివకుమార్ చేసిన ఉద్వేగపూరిత వ్యాఖ్యలు ఆయన పట్టుదలకు అద్దంపట్టాయి.
అయితే, హోటల్లో బస చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి శివకుమార్‌ని కలిసేందుకు ససేమిరా అంటున్నారు. మంత్రిగారిపై మర్యాద, గౌరవం, అభిమానం ఉన్నాయి కానీ ఈ విషయంలో తామంతా ఎంతో ఆవేదనతో ఉన్నామని, అందుకు ఆయన్ని కలిసేందుకు ఇష్టపడటం లేదని అసమ్మతి ఎమ్మెల్యే బసవరాజ్ తెలిపారు.