హర్యానాలో కాశ్మీరీలపై దాడి: మోదీ స్పందించాలని డిమాండ్

హర్యానాలోని మహేంద్రఘర్ ప్రాంతంలోని సెంట్రల్ యూనివర్సిటిలో చదువుతున్న ముస్లిం విద్యార్థులపై దాడి జరిగింది.

Last Updated : Feb 3, 2018, 01:59 PM IST
హర్యానాలో కాశ్మీరీలపై దాడి: మోదీ స్పందించాలని డిమాండ్

హర్యానాలోని మహేంద్రఘర్ ప్రాంతంలోని సెంట్రల్ యూనివర్సిటిలో చదువుతున్న ముస్లిం విద్యార్థులపై దాడి జరిగింది. ఆఫ్తాబ్ అనే విద్యార్థి తన స్నేహితుడితో కలిసి వెళ్లి నమాజ్ చేసి తిరిగి వస్తుండగా.. అతని బైక్‌ని దాదాపు 20 మంది వ్యక్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు విద్యార్థులను విచక్షణారహితంగా చావబాదారు. ఆ తర్వాత అదే సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. అయితే ఎవరూ ఏమీ పట్టించుకోలేదు.

విద్యార్థులు ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకొని.. ఆ తర్వాత కాలేజీకి వెళ్లి.. అక్కడ నుండే పోలీసులకు తమపై జరిగిన దాడి గురించి సమాచారం అందించారు. ఇదే సంఘటనపై విద్యార్థులు స్పందిస్తూ.. ఆ ప్రాంత ప్రజలు  మాపై జరిగిన దాడిని ఒక వేడుక చూస్తున్నట్లు చూశారే తప్పితే ఎవరు కూడా కనీసం జాలిపడి సహాయం చేయలేదని తెలపడం గమనార్హం.

ఈ నేపథ్యంలో హర్యానాలో కాశ్మీర్ విద్యార్థులపై జరిగిన దాడిపై జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఎంక్వయరీ వేయాలని డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాశ్మీరీలపై దాడులు విచక్షణారహితంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే విషయంపై స్పందించిన మాజీ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పరమతసహనంపై మోదీ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు జరుగుతున్నాయని.. హర్యానా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. 

Trending News