న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే మళ్లీ అధికార పగ్గాలు దక్కాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఢిల్లీ ప్రజలు .. అరవింద్ కేజ్రీవాల్ కే గ్రాండ్ విక్టరీ కట్టబెట్టారు. ఆయన్నే మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెట్టారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇంకా చెప్పాలంటే .. చీపురు పార్టీ .. ఢిల్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలను ఊడ్చి పారేసింది. ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియలో ముందు నుంచీ ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆధిక్యం ప్రదర్శించింది. తుదకు వెలువడిన ఫలితాల్లో సత్తా చాటింది. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు గెలిచింది.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ .. ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసి.. తమ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లు తమ వైపు ఉన్నారని చాటి చెప్పుకుంది.
ఢిల్లీ ఎన్నికల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు
ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. విజయోత్సాహాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో కలిసి పంచుకున్నారు. ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ వాసులు కోరుకున్న అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా అహో రాత్రులు పని చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అభినందించారు.
अपने बेटे को इतना प्यार देने के लिए दिल्लीवसियों का तहे दिल से शुक्रिया। आज दिल्ली वालों ने एक नई राजनीति को जन्म दिया “काम की राजनीति”। ये भारत माता की जीत है। जय हिंद। pic.twitter.com/q5xP8ytYvc
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 11, 2020
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 62 సీట్లు దక్కించుకుని అధికార పీఠాన్ని అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో దూసుకువెళ్తోన్న బీజేపీ . . ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి. మొత్తంగా తుది ఫలితాలు వెలువడే సరికి 8 స్థానాలకు పరిమితమైంది. ఐతే గతంలో పోలిస్తే ఇది కాస్త మెరుగైన ప్రదర్శనగా చెప్పవచ్చు.
మరోవైపు ఢిల్లీని మూడుసార్లు పరిపాలించిన కాంగ్రెస్ . . 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.