కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా రమేష్ కుమార్‌

మూజువాణి ఓటు ద్వారా స్పీకర్ ఎంపిక 

Last Updated : May 25, 2018, 05:23 PM IST
కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా రమేష్ కుమార్‌

కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి నేడు బల పరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం సభ కొత్త స్పీకర్‌ని ఎన్నుకుంది. మూజువాణి ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌ని శాసన సభ స్పీకర్‌గా అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత స్పీకర్ పదవి కోసం భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే సురేష్ కుమార్ బరిలోకి దిగినప్పటికీ.. రమేష్ కుమార్ అభ్యర్థిత్వం అనంతరం ఆయన తన నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే తాను పోటీకి సిద్ధపడినప్పటికీ.. స్పీకర్ పదవిపై వున్న గౌరవంతో సభా సంప్రదాయం ప్రకారం పోటీ నుంచి వైదొలగడమే ఉత్తమమని తిరిగి పార్టీ నిర్ణయించుకుందని, అందువల్లే తాను పోటీ నుంచి తప్పుకున్నానని సురేష్ కుమార్ తెలిపారు. ఈమేరకు సురేష్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన రమేష్ కుమార్‌కి బీజేపీ శాసన సభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప అభినందనలు తెలిపారు. స్పీకర్‌గా రమేష్ కుమార్ ఎంపిక అనంతరం బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ 'తాను సభలో జరిగే ప్రతీ సమావేశానికి హాజరవుతాను' అని స్పష్టంచేశారు. 

 

ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్‌కి శుభాకాంక్షలు చెబుతూ.. స్పీకర్‌గా రమేష్ కుమార్ గారు ఆ స్థానానికి గౌరవం తీసుకొచ్చారు అని అన్నారు. గతంలో ఐదేళ్లపాటు స్పీకర్ స్థానంలో కొనసాగిన రమేష్ కుమార్ ఆ పదవిలో ఎంతో హుందాగా వ్యవహరించారు అని కుమారస్వామి గుర్తుచేసుకున్నారు. అనంతరం సభ బల పరీక్షకు సిద్ధమైంది. కడపటి వార్తలు అందే సమయానికి కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కుంటోంది.  

Trending News