2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుండి ఆర్జేడీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత రాహుల్ తివారీ కూడా తమ పార్టీ ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలపడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అయితే ఈ విషయంలో లాలూ కుటుంబ నిర్ణయం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
ఇటీవలే లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌తో మాజీ మంత్రి చంద్రికా ప్రసాద్ రాయ్ కుమార్తె ఐశ్వర్యారాయ్‌కి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివాహం సమయమప్పుడు లాలూ పెరోల్ మీద వచ్చి మరీ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అదే పెళ్లిలో దొంగలు పడి భోజన పదార్థాలు, వంట సామానులు కూడా అపహరించడంతో ఆ వార్త కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది.
ఇప్పటికే ఆర్జేడీ పార్టీకి సంబంధించి లాలూ కుటుంబ సభ్యులకే ఎక్కువ స్థాయిలో పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో లాలూ కుమారులతో పాటు కోడలికి కూడా పట్టం కట్టాలని కూడా అధినేత భావిస్తున్నట్లు పలువురు అంటున్నారు. గతంలో కూడా లాలూ సతీమణి రబ్రీదేవి సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే.