కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కూడా తమ ప్రాబల్యాన్ని మజ్లిస్ పార్టీ చూపించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థులు 40 స్థానాల్లో పోటీ చేయనున్నారని ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ పార్టీ కర్ణాటకలో జనతాదళ్‌తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో అసదుద్దీన్ ఒవైసీ.. బెంగళూరుకి వచ్చి కర్ణాటక శాఖ నాయకులతో కూడా మంతనాలు చేయనున్నట్లు సమాచారం. అలాగే అభ్యర్థుల జాబితాను కూడా రెండు రోజులలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ సమావేశాల సమయంలో పలుమార్లు జనతాదళ్ నాయకుడైన దేవెగౌడ, అసదుద్దీన్ ఒవైసీ కలుసుకున్నా.. పొత్తుల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అగ్రిమెంట్‌కూ రాలేదని మాత్రం తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణతో పాటు బయట రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. మే 12వ నుండి కర్ణాటక ఎన్నికలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ పార్టీ అదే రాష్ట్రంలోని ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి ఇప్పటి నుండే సమాయత్తమవుతుంది. అలాగని ప్రస్తుతం కర్ణాటకలో ముస్లిం నాయకులు లేరని కాదు. బి.ఏ మొహిద్దీన్ బావా (మంగళూరు నార్త్), డాక్టర్ రఫీక్ అహ్మద్ (తుమ్కుర్), ఫైరోజ్ నూరుద్దీన్ (బెలగాం), కమర్ ఉల్ ఇస్లామ్ (గుల్బర్గా) లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే ఇక్బాల్ అన్సారీ లాంటి నాయకులు జనతాదళ్‌లో కూడా ఉన్నారు.