న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ కీలకనేతలు సోమవారం జేపీ నడ్డాను కీలక పదవికి ప్రతిపాదించారు. ఎవరి నుంచి పోటీ లేకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికైనట్లు బీజేపీ సీనియర్ నేత రాధా మోహన్ సింగ్ ప్రకటించారు. 2019 జులైలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నడ్డా తాజాగా కమలదళం పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ కీలకనేతలు అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గతేడాదే నడ్డాకు పూర్తిస్థాయి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు దక్కాలి. కానీ పార్టీ నియమాల ప్రకారం దేశంలోని కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ప్రస్తుతం సగానికి పైగా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పార్టీ జాతీయ స్థాయి బాస్ ఎంపికను చేపట్టారు. పార్టీ వ్యూహకర్తలతో ఒకరైన నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
పూర్తి పేరు: జగత్ ప్రకాశ్ నడ్డా
జననం: 2 డిసెంబర్ 1960
పుట్టిన ప్రాంతం: పట్నా (బిహార్)
తల్లిదండ్రులు: డా.నరైన్ లాల్ నడ్డా, స్వర్గీయ క్రిష్ణ నడ్డా
భార్య: డాక్టర్ మల్లికా నడ్డా
సంతానం: ఇద్దరు
విద్యార్హతలు: బీఏ, ఎల్.ఎల్.బి
రాజకీయ ప్రస్థానం
జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా జేపీ నడ్డా 1975లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దివంగత ప్రధాని నియంతపాలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగింది. 1977లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తరఫున పోటీ చేసి సెక్రటరీగా గెలిచారు. నడ్డా తండ్రి పట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్. ఏబీవీపీలో కెరీర్‌ను డెవలప్ చేసుకుంటూ ఉన్నత పదవులు పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించారని 1987లో 45 రోజులపాటు హౌస్ అరెస్ట్ అయ్యారు. రాష్ట్రీయ సంఘర్ష్ మోర్చాను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
1989 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 29 ఏళ్ల వయసులో బీజేపీ యువ విభాగం ఎన్నికల ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1991లో లోక్‌సభ ఎంపీ జయశ్రీ బెనర్జీ కూతరు డాక్టర్ మల్లికను వివాహం చేసుకున్నారు. జయశ్రీ 11ఏళ్లపాటు ఏబీవీపీ సభ్యురాలు, జాతీయ కార్యదర్శిగానూ చేశారు. 1991లో 31ఏళ్లకే భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993-98, 1998 నుంచి 2003, 2007 నుంచి 2012 మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా మూడు పర్యాయాలు విశేష సేవలందించారు.
భారత ప్రతినిధిగా కోస్టారికా, గ్రీస్, టర్కీ, యూకే, కెనడా, తదితర దేశాల్లో పర్యటించారు. 2012లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2014-19 మధ్య కాలంలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రిగా సేవలందించారు. ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ సంబంధిత కమిటీలకు సభ్యుడిగా వ్యహరించారు. ఆరెస్సెస్‌తోనూ ఆయనకు అనుబంధం ఉంది. గతేడాది జూన్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నడ్డా.. నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.