దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించిన నిర్భయ తల్లి

దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ ఘటనపై నిర్భయ తల్లి స్పందించారు. దిశ కేసులో ఆమె తల్లిదండ్రులకు ఏడు రోజుల్లోనే న్యాయం లభించడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తంచేశారు.

Updated: Dec 6, 2019, 05:05 PM IST
దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించిన నిర్భయ తల్లి

హైదరాబాద్: దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ ఘటనపై నిర్భయ తల్లి స్పందించారు. దిశ కేసులో ఆమె తల్లిదండ్రులకు ఏడు రోజుల్లోనే న్యాయం లభించడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తంచేశారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఆమె మాట్లాడుతూ.. నిందితులకు తెలంగాణ పోలీసులు విధించిన శిక్ష సరైనదని అన్నారు. తెలంగాణ పోలీసులు ఈ విషయంలో మంచి పని చేశారని ఆమె అభినందించారు. ఢిల్లీలో 2012లో నిర్భయ హత్య జరిగి ఏడేళ్లయినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని, నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని.. హైదరాబాద్‌లో హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశా కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో ఆ కుటుంబానికి ఏడు రోజుల్లోనే న్యాయం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నిర్భయ నిందితులను కూడా వెంటనే  ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు.

దిశపై సామూహిక అత్యాచారం జరిపి ఆమెను దారుణంగా హతమార్చిన కేసులో నలుగురు నిందితులైన మహ్మద్ ఆరిఫ్ పాషా, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌లు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే.