నిర్భయ కేసులో రేపిస్టులకు మరణశిక్షను ధ్రువీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఉరిశిక్ష పడిన దోషులు పెట్టుకున్న రివ్యూ పిటీషన్ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం చేశారు. తమ కుమార్తె పట్ల నరరూప రాక్షసులుగా వ్యవహరించి.. దారుణానికి ఒడిగట్టిన వారికి మరణశిక్ష తప్పకుండా విధించాల్సిందేనని వారు అభిప్రాయపడ్డారు.
2012లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన దారుణమైన అత్యాచార ఘటన దేశాన్ని మొత్తం కదిలేలా చేసింది. ఈ కేసులో ముఖేష్ (29), పవన్ గుప్తా (22), వినయ్ శర్మ (23) అనే ముగ్గురు వ్యక్తులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు గతంలో తీర్పు ఇచ్చారు. కానీ శిక్ష తగ్గించాలని కోరుతూ వారు మరల రివ్యూ పిటీషన్ వేశారు. ఈ క్రమంలో ఈ పిటీషనుకు సంబంధించిన తుది తీర్పును ధ్రువీకరిస్తూ.. ఆ పిటీషన్ను తాము తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఈ తీర్పు వెలువడ్డాక, నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కోర్టు చాలా జాప్యం చేసిందని.. హంతకులను సాధ్యమైనంత త్వరగా ఉరి తీయాలని ఆమె కోరారు. నిర్భయ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. అందులో ప్రధానమైన వ్యక్తి రాంసింగ్ గతంలో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. మరో వ్యక్తికి 18 సంవత్సరాలు కూడా నిండకపోవడంతో జువైనల్ హోంకి పంపించారు. మూడు సంవత్సరాలు తనని అక్కడ ఉంచి తర్వాత విడుదల చేశారు. ఇదే కేసులో మరో నేరస్తుడు రీ పిటీషను వేయలేదు.