ఆధార్ లేదని చేర్చుకోలేదు; ఆసుపత్రి బయటే ప్రసవించిన మహిళ

పురిటి నొప్పులతో వచ్చిన మహిళపట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆ ఆసుపత్రి సిబ్బంది.

Last Updated : Feb 10, 2018, 04:27 PM IST
ఆధార్ లేదని చేర్చుకోలేదు; ఆసుపత్రి బయటే ప్రసవించిన మహిళ

పురిటి నొప్పులతో వచ్చిన మహిళపట్ల అమానుషంగా ప్రవర్తించారు ఓ ఆసుపత్రి సిబ్బంది. ఆధార్ ఉంటేనే చేర్చుకుంటామని సిబ్బంది చెప్పడం.. ఆ సమయంలో మహిళకు పురిటి నొప్పులు ఎక్కువై ఆసుపత్రి బయటే ప్రసవించడం జరిగింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మున్నీ అనే 25 ఏళ్ల మహిళకు పురిటి నొప్పులు రావడంతో భర్త బబ్లూ (28), కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. క్యాజువాలిటీ వార్డుకు వెళ్తే లేబర్ వార్డుకు వెళ్లమని చెప్పడంతో, లేబర్ వార్డుకు వచ్చారు. అక్కడ సిబ్బంది ఆధార్ ఉంటేనే చేర్చుకుంటామని చెప్పారు. ఇప్పుడు నేను ఆధార్ తీసుకురాలేదని.. తర్వాత ఇస్తానని భర్త ఎంత చెప్పినా సిబ్బంది వినలేదు.

చేసేదేమీ లేక భర్త బబ్లూ మున్నీ వద్ద కుటుంబ సభ్యులను ఉండమని చెప్పి ఆధార్ తీసుకురావడానికి ఇంటికి వెళ్లాడు. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి బయటే ప్రసవించింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఈ వివాదంపై స్పందించిన గురుగ్రామ్ ఆరోగ్య శాఖాధికారి ఘటనకు కారణమైన సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Trending News