బ్యాలెట్ పద్దతికి వెళ్లే ప్రసక్తే లేదు: సునీల్ అరోరా

అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్‌ వంటి అక్రమాలకు వీల్లేదని, ఇకపై భవిష్యత్తులో ఈవిఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా మరోసారి స్పష్టం చేశారు. 

Updated: Feb 12, 2020, 11:45 PM IST
బ్యాలెట్ పద్దతికి వెళ్లే ప్రసక్తే లేదు: సునీల్ అరోరా

న్యూ ఢిల్లీ: అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్‌ వంటి అక్రమాలకు వీల్లేదని, ఇకపై భవిష్యత్తులో ఈవిఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా మరోసారి స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా బ్యాలెట్ పద్థతికి వెళ్లే ప్రసక్తే లేదని ఎన్నికల కమిషన్ బుధవారం తెలిపింది. విధానం సరైనదని స్పష్టం అయినప్పుడు దీనిని మార్చాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించింది. టైమ్స్ నౌ సమ్మిట్‌లో సునీల్ అరోరా మాట్లాడుతూ.. ఓటింగ్ పద్థతిని మార్చే అంశం తమ ముందు లేదన్నారు. పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని, దీనికోసం త్వరలోనే వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపలు జరుపుతామని సునీల్ అరోరా వెల్లడించారు.

దేశంలోని పలు రాజకీయ పార్టీలు  ఈవిఎంలపై ఆరోపణలు చివరికి ఇబ్బందికరంగా మారుతున్నాయని, వీటికి స్వస్తి చెప్పాలని పార్టీ నేతలకు సీఇసీ విజ్ఞప్తి చేశారు. కొన్ని సమయాల్లో సాంకేతిక సమస్యలుండటం సహజమన్నారు. వాతావరణ సమస్యల కారణం కావొచ్చు, వేరే ఇతర కారణాలు కావొచ్చని సునీల్ అరోరా వివరణిచ్చారు. అయితే వీటిని ట్యాంపరింగ్ చేయలేమని, అదే విధంగా ఈవిఎంలతో అక్రమాలకు  అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈవిఎంతో ఓటింగ్ ప్రక్రియ ఆరంభమై ఇప్పటికే 20 సంవత్సరాలు అవుతోందని, తిరిగి బ్యాలెట్ పత్రాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని సీఇసీ వెల్లడించారు. ఈవిఎంలతో ఓటింగ్‌ను సుప్రీంకోర్టు సహా పలు కోర్టులు సమర్థించాయని ఆయన అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..