సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన "పద్మావత్" చూసిన తర్వాత తనకు అందులో అభ్యంతరకరమైన అంశాలేవీ కనిపించలేదని "ఆర్ట్ ఆఫ్ లివింగ్" వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ తెలియజేశారు. బెంగళూరులోని "ఆర్ట్ ఆఫ్ లివింగ్" ఆశ్రమంలో "పద్మావత్" చిత్రాన్ని ఆయన కోసం స్పెషల్ స్క్రీనింగ్గా నిర్మాతలు ఏర్పాటు చేయగా.. రవిశంకర్ ఆ చిత్రాన్ని చూశారు.
జనవరి 15, 2018 తేదిన ఈ సినిమాను తాను చూశానని.. అందులో రాజపుత్రుల గొప్పదనంతో పాటు రాణీ పద్మావతి ఔన్నత్యాన్ని తెలిపే అంశాలు మాత్రమే ఉన్నాయని..చాలామంది సినిమాను చూడకుండా ఎందుకు చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశం గర్వపడే చిత్రంగా "పద్మావత్" నిలిచిపోతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే రాజపుత్ర కర్ణిసేన సభ్యులు ఈ చిత్రాన్ని నిలిపివేయాల్సిందిగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకున్నా కూడా ఆ చిత్రాన్ని విడుదల కానివ్వమని రాజపుత్ర సంఘాలు తెలుపుతున్నాయి.