Patanjali Coronil tablets: న్యూ ఢిల్లీ: కరోనావైరస్‌కు మందు కనిపెట్టానంటూ ప్రకటించిన పతంజలి సంస్థ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఆ సంస్థ కనిపెట్టిన కరోనా మందు కొరోనిల్ మెడిసిన్ ( Coronavirus medicine ) చుట్టూ ప్రస్తుతం వివాదం రేగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ( Central health ministry ), ఐసీఎంఆర్ ( ICMR ) ఆదేశాల్ని సంస్థ బేఖాతరు చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు మందును పతంజలి సంస్థ ( Patanjali ) కనిపెట్టిందని యోగా గురువు బాబా రాందేవ్ ( Baba Ramdev ) ప్రకటించడంతో ఒక్కసారిగా అందరిలో ఉత్సాహం కన్పించింది. కోరోనిల్ ( Coronil tablets ) పేరుతో మార్కెట్‌లో రానున్నట్టు కూడా రాందేవ్ బాబా ప్రకటించారు. అయితే ఆ ఆనందం... ఆ ఉత్సాహం ఆయనకు ఎక్కువసేపు నిలవలేదు. పతంజలి తీసుకొచ్చిన ఈ కరోనావైరస్ మందుపై ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌లు ఆంక్షలు విధించాయి. మందు ఎలా పనిచేస్తుంది ? ఫార్ములా వివరాలు ఏంటనే వివరాల్ని చెప్పడమే కాకుండా మందు పని చేస్తుందని రుజువు చేసేవరకూ మార్కెట్‌లో ప్రవేశపెట్టకూడదని స్పష్టం చేశాయి. అంతేకాకుండా ఏ విధమైన ప్రొమోషనల్ కార్యక్రమాలు కూడా చేపట్టకూడదని ఆంక్షలు విధించింది.
అయితే ఈ ఆదేశాల్ని కాదని యోగా గురువు హరిద్వార్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. కోరోనిల్ మందు ప్రయోజనాల్ని వివరించడం చర్చనియాంశమైంది. మందులు మార్కెట్‌లో విడుదల చేయాలంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఓ నోటీసు కూడా జారీ చేసింది. అటు కరోనా మందులకు సంబంధించిన ఏ విధమైన అనుమతుల్ని పతంజలి సంస్థ తీసుకోలేదని కేంద్ర ఆయుష్ శాఖ ( Ayush ministry) కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాందేవ్ బాబా హరిద్వార్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
భారతీయ ప్రమాణాల ప్రకారం ఏ ఔషధం అయినా మార్కెట్‌లోకి రావడానికంటే ముందుగా కనీసం 220 మందిపై ట్రయల్స్ నిర్వహించి విజయం సాధించాల్సి ఉంటుంది. అది కూడా ఆ ట్రయల్స్‌ను సంబంధిత రోగ లక్షణాలున్నట్టు ధృవీకరించిన వ్యక్తులపైనే చేయాల్సి ఉంటుంది. కానీ పతంజలి సంస్థ.. రోగ లక్షణాలు స్వల్పంగా, ఓ మోస్తరుగా ఉన్నవారిలో వందమందిపై ఈ మందును ప్రయోగించగా... 66 మంది కోలుకున్నారని ప్రకటించింది.
అయితే, భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా, చట్టపరమైన విధానాలన్ని అనుసరిస్తూ కొరొనిల్ మందు పనిచేసే విధానాన్ని రుజువు చేసేంతవరకూ కొరొనిల్ ట్యాబ్లెట్స్‌కి మార్కెట్‌లో అనుమతి లేదని ఐసీఎంఆర్, ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి. అయినా సరే... బాబా రామ్ దేవ్ టీవీల్లో ప్రకటనలు, మీడియా సమావేశాలతో మందును ప్రమోట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ నేపధ్యంలో కోరోనిల్ మందు మార్కెట్‌లో వస్తుందా లేదా అనేది సందేహాస్పదంగా మారింది.