జీఎస్టీ డే: 'దేశ ప్రజల సహకారంతోనే జీఎస్టీ విజయం': మోదీ

'ఒకే దేశం-ఒకే పన్ను’ అనే నినాదంతో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ అమలులోనికి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది.

Last Updated : Jul 1, 2018, 04:10 PM IST
జీఎస్టీ డే: 'దేశ ప్రజల సహకారంతోనే జీఎస్టీ విజయం': మోదీ

'ఒకే దేశం-ఒకే పన్ను’ అనే నినాదంతో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ అమలులోనికి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జీఎస్టీ తొలి వార్షికోత్సవ సంబరాలను కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీని ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని పేర్కొన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అభివృద్ధిని తీసుకొచ్చిందన్నారు. ఉత్పాదనను పెంచి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చిందని ట్వీట్ చేశారు. జీఎస్టీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. టీమిండియా స్ఫూర్తికి ఇది నిదర్శనమన్నారు.

'జీఎస్టీ అమలై నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తొలుత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న జీఎస్టీ దేశ ప్రజల సహకారం వల్లనే విజయవంతమైంది. సహకార సమాఖ్యకు, టీమిండియా స్ఫూర్తికి ఇది నిదర్శనం. భారత ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఎన్నో సానుకూల మార్పులు తీసుకొచ్చింది' అని మోదీ అన్నారు.

2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 33 మంది సభ్యులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో జులై 1ను ‘జీఎస్టీ డే’గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జీఎస్టీ దేశవ్యాప్తంగా ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నదని, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ట పర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ఎన్నో ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఒక ప్రకటనలో అన్నారు.

పన్ను సంబంధిత ఎన్నో సమస్యలను జీఎస్టీ రావడంతో పరిష్కారం అయ్యాయని.. జీఎస్టీ వచ్చిన ఏడాది కాలంలో స్వచ్ఛందంగా పన్ను చెల్లించడానికి వ్యాపారులు ముందుకు రావడమే విజయానికి తార్కాణం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Trending News