దేశ ప్రధాని హోదాలో, స్వల్ప వ్యవధిలో నరేంద్ర మోడీ చేసినన్ని విదేశీ పర్యటనలు ఇంతకు ముందెప్పుడూ, ఏ ప్రధాని చేయలేదు అనేది ఆయనపై తరచుగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు. మోడీ పాలనని విమర్శించే విషయానికొస్తే, ఆయన విదేశీ పర్యటనలు ఎప్పుడూ ప్రతిపక్షాలకి ఓ ఆయుధమే. కానీ వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలని మెరుగు పర్చుకోవడమే లక్ష్యంగా సందర్భాన్నిబట్టి మోడీ విదేశీ పర్యటనలకి వెళ్తున్నారనేది ఆయన మద్దతుదారుల అభిప్రాయం. ఇందులో ఎవరి వాదనలు ఎలా వున్నాయనే సంగతిని కాసేపు పక్కనపెడితే.. ఇంతకీ 2017లో నరేంద్ర మోడీ ఎప్పుడెప్పుడు, ఏయే దేశాలు చుట్టొచ్చారో ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2017 మే నెలలో 11, 12 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంకలో పర్యటించి అక్కడ జరిగిన వెసక్ డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమ్‌సింఘెతో భేటీ అయ్యారు.
ఇదే మే నెలలో 29-30 తేదీల మధ్య ప్రధాని మోడీ జర్మనీలో పర్యటించారు. ఈ పర్యటనలో జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్‌మీర్ ఆహ్వానం మేరకు ఆయనతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు.
ఇదే 30వ తేదీన స్పెయిన్‌లోనూ పర్యటించిన ప్రధాని మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు మరియనో రజోయ్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య పరస్పర ఆసక్తికరమైన అంశాలపై చర్చించారు. అంతేకాకుండా ఇదే పర్యటనలో స్పెయిన్ రాజు ఫెలిప్‌తోనూ భేటీ అయ్యారు.
జూన్ 1-2 తేదీల మధ్య ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన 18వ భారత్-రష్యా వార్షిక సదస్సులో మోడీ పాల్గొన్నారు. ఇదే పర్యటనలో భారత్-రష్యా మధ్య సత్సంబంధాలని మరింత మెరుగు పర్చడమే లక్ష్యంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన మోడీ.. దేశానికి ఎంతో కీలకమైన కూడంకుళం అణు ఒప్పందంపై ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
జూన్ 2-3 తేదీల మధ్య ఫ్రాన్స్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు ధ్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
జూన్ 24న పోర్చుగల్ పర్యటనకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో పరస్పర ఆర్థిక సహకారం, శాస్త్ర, సాంకేతిక, పౌర సంబంధాలని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా పోర్చుగల్‌లో వున్న భారతీయులతోనూ మోడీ భేటీ అయ్యారు.
జూన్ 24-26తేదీల మధ్య అమెరికాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతం దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపారు. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలోని పెట్టుబడిదారులతోనూ మోడీ భేటీ అయ్యారు.
జూన్ 27వ తేదీన నెదర్లాండ్స్‌లో పర్యటించిన మోడీ ఈ పర్యటనలో నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె, రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మ్యాగ్జిమతోపాటు నెదర్లాండ్స్‌కి చెందిన అనేక బహుళ జాతి కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు.
ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పర్యటనలన్నీ ఒక ఎత్తయితే, 4-6 తేదీల మధ్య చేసిన ఇజ్రాయెల్ పర్యటన మరో ఎత్తు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. ఈ పర్యటన తర్వాత మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్‌లో పర్యటించిన భారత ప్రధానిగా రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు రువెన్ రివ్లిన్, ప్రధాని నెతన్యహుతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
జులై 7, 8 తేదీలలో జెర్మనీలో మరోసారి పర్యటించిన ప్రధాని మోడీ.. ఈసారి హంబర్గ్‌లో జరిగిన జీ-20 సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగానే మోడీ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు.
9వ బ్రిక్స్ సదస్సుకి హాజరవడం కోసం సెప్టెంబర్ 3-5 తేదీల మధ్య చైనా పర్యటనకి వెళ్లిన ప్రధాని మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. డొక్లాం వివాదం ముదిరిన తర్వాత మోడీ చైనాలో పర్యటించడంతో ఈ పర్యటనకి అత్యంత ప్రాధాన్యత కనిపించింది. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాధినేతలతో భేటీ అయిన మోడీ.. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు సభ్య దేశాలు కలిసి రావాల్సిందిగా బలమైన వాణి వినిపించారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా మొదటిసారిగా సెప్టెంబర్ 5-7 తేదీల మధ్య మయన్మార్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఆ దేశ అధ్యక్షుడు హితిన్ క్య, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో ఇరుదేశాల మధ్య ప్రాంతీయ సహకారం ఆవశ్యకతపై చర్చించారు.
మనీలాలో నవంబర్ 12-14 తేదీల మధ్య జరిగిన ఏషియన్-ఇండియా, తూర్పుఆసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ వివిధ దేశాధినేతలతో సమావేశమై అనేక కీలక అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు.