న్యూఢిల్లీ: ఆధార్ నెంబర్ లేదంటే ఇతర వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్ ద్వారా వెల్లడించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. మేరా ఆధార్, మేరీ పెహచాన్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో ఆధార్‌ను పొందవచ్చంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..! అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని యూఐడీఏఐ తెలిపింది.
ఇప్పటివరకూ యూఐడీఏఐ డేటాబేస్ నుంచి ఏ ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు బయటకు వెళ్లలేదని స్పష్టం చేసింది ఆ సంస్థ. 'ఒక వ్యక్తి ఐడీ కార్డు ఆధారంగా మోసం చేయాలంటే ఆధార్ కార్డు ఒక్కటే సరిపోదు. కనుపాప, వేలిముద్రలు లాంటి బయోమెట్రిక్ గుర్తులు కూడా సరిపోవాల్సి ఉంటుంది' అని యూఐడీఏఐ వెల్లడించింది. ఎవరైనా అనధికారికంగా వ్యక్తి సమాచారాన్ని నెట్ లో పెడితే స్వేచ్ఛా హక్కుల భంగం కింద కేసును నమోదు చేయాల్సి వస్తుందని వివరించింది.