రఘురామ్ రాజన్‌కు రాజ్యసభ కుర్చీ వద్దంట..!

  

Last Updated : Nov 9, 2017, 03:21 PM IST
రఘురామ్ రాజన్‌కు రాజ్యసభ కుర్చీ వద్దంట..!

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజ్యసభ మెంబరు అవుతున్నారన్న విషయంపై మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. ఇటీవలే ఈ విషయంపై రాజన్ స్వయంగా స్పందించారు. తనకు అలాంటి పదవులపై ఆసక్తి లేదని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలి కాలంలో తమకు కేటాయించిన మూడు రాజ్యసభ సీట్లలో ముగ్గురు పార్టీకతీతమైన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని భావించింది. అందులో రఘురామ్ రాజన్ కూడా ఒకరని వార్తలొచ్చాయి. పార్టీ ఆ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా మంజూరు చేయనప్పటికీ.. ఆ వార్త మాత్రం బాగా జనాల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదని రాజన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తనకు ప్రస్తుతం భారతదేశం వచ్చే ఉద్దేశ్యం లేదని.. చికాగోలోనే కొన్నాళ్లు అధ్యాపక ఉద్యోగంలో ఉంటానని ఆయన ప్రకటన విడుదల చేశారు.  "రాక్ స్టార్ సెంట్రల్ బ్యాంకర్"గా పేరుగాంచిన రాజన్ రిజర్వు బ్యాంకుకు 23వ గవర్నరుగా పనిచేశారు. అంతకు ముందు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థకు ఛీఫ్ ఎకనామిస్టుగా కూడా సేవలందించారు.

Trending News