కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తాను లోక్ సభకు పోటీచేయనున్న రెండో స్థానమైన వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రే రాహుల్ గాంధీ కేరళలోని కొజికోడ్ చేరుకోగా విమానాశ్రయం వద్ద ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో చేరుకుని ఘన స్వాగతం పలికారు. కేరళలో పార్టీ సీనియర్ నేతలైన మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది, రమేష్ చెన్నింతల, ముకుల్ వాస్నిక్, కేసి వేణుగోపాల్, ముళ్లప్పల్లి రామచంద్రన్, ఐయుఎంఎల్ నేతలు పికే కున్హలికుట్టి, ఈటి ముహమ్మద్ బషీర్ వంటి నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేథి నుంచి మాత్రమే కాకుండా కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీచేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సోదరి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ఇంచార్జ్ ప్రియాంకా వాద్రా సైతం కేరళకు చేరుకున్నారు. గురువారం ఉదయం రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ వెంట వాయనాడ్ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ బస చేసిన కొజికోడ్ నుంచి వాయనాడ్ 90 కిమీ ఉండనుండగా రాహుల్ గాంధీ హెలిక్యాప్టర్ ద్వారా అక్కడికి చేరుకోనున్నారు. తన నామినేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ వాయనాడ్‌లో భారీ ర్యాలి నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.