చెన్నైలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదు రోజులుగా ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం తడిసిముద్దయింది. కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడులోని ఆరు జిల్లాల్లో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్లు నీట మునిగాయి, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్ష తీవ్రత అధికమవుతోంది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, కడలూరు, తిరువారూర్, నాగపట్టణం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో వర్షం అధికంగా పడుతోంది.
శనివారం కూడా భారీ వర్షం పడడంతో చెన్నై నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ మరోసారి జలమయమయ్యాయి. శివారు ప్రాంతాలు చాలా వరకు చెరువులు, కుంటలుగా తలపించాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు సగం మందికి పైగా మంత్రులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. అధికారులు, డిజాస్టర్ మానేజ్మెంట్ సిబ్బంది శిధిలాల కింద చిక్కుకున్నవారిని, నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాల కారణంగా శనివారం చెన్నై నగరానికి రాకపోకలు స్తంభించాయి. పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు సెలవు ప్రకటించారు.