Rs 2000 notes | రూ. 2000 నోట్ల రద్దుపై స్పందించిన కేంద్రం

ఆర్బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసినట్లు వెలువడిన వార్తలు అనేక సందేహాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కి ఆర్బీఐ సమాధానం ఇస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రతీ ఏడాది రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చినట్టుగా వెల్లడైన సంగతి తెలిసిందే.

Last Updated : Dec 11, 2019, 02:00 AM IST
Rs 2000 notes | రూ. 2000 నోట్ల రద్దుపై స్పందించిన కేంద్రం

న్యూ ఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2000 నోటును కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఉపసంహరించుకుంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. అయితే, తాజాగా ఈ విషయంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) స్పందిస్తూ.. రూ.2000 నోట్లను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు(Demonetization)పై జరుగుతున్న ప్రచారాన్ని, వినిపిస్తున్న వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనురాగ్ ఠాకూర్ తేల్చిచెప్పారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రూ.2000 నోటును రద్దు చేయబోతున్నారా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి ఠాకూర్ ఈ వివరణ ఇచ్చారు. 

Read also : రూ.2వేల నోట్లను రద్దు చేయం, రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకొస్తాం: కేంద్రం

ఆర్బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసినట్లు వెలువడిన వార్తలు అనేక సందేహాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కి ఆర్బీఐ సమాధానం ఇస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రతీ ఏడాది రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చినట్టుగా వెల్లడైన సంగతి తెలిసిందే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి 111.507 మిలియన్ నోట్లను మాత్రమే ముద్రించింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 46.690 మిలియన్ నోట్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. సరిగ్గా ఈ వరుస పరిణామాలే రూ.2000 నోటును మళ్లీ రద్దు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడానికి కారణమైంది. 

రూ. 2000 నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2000 నోటును ప్రవేశపెట్టినట్టుగానే త్వరలోనే మళ్లీ రూ.2000 వేల నోటును కూడా రద్దు చేసి దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సారాంశం. ఇదే విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషద్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ స్పందిస్తూ.. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను అరికట్టడంతోపాటు ఉగ్రవాదాన్ని అణిచేసేందుకే ప్రభుత్వం నోట్ల రద్దును చేపట్టిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం సైతం ఓ కారణమని ఠాకూర్ వెల్లడించారు.

Trending News