భారత్ నుండి పరారైన మరో ఆర్థిక నేరగాడు..!

వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మరో ఆర్థిక నేరగాడు

Last Updated : Sep 24, 2018, 10:29 AM IST
భారత్ నుండి పరారైన మరో ఆర్థిక నేరగాడు..!

బ్యాంకులకు రూ.5వేల కోట్లు ఎగ్గిట్టిన నితిన్ సందేసరా.. విదేశాలకు వెళ్లిపోయాడు. కుటుంబంతో సహా నైజీరియాకు వెళ్ళాడు. వడోదరలో స్టెర్లింగ్ బయోటెక్‌ను స్థాపించిన ఈ గుజరాతీ.. బ్యాంకుల నుండి డబ్బు పొంది విదేశాలకు మళ్లించారు. న్యాయ అంశాల్లో నైజీరియాతో భారత్‌కు అంతగా సత్సంబంధాలు లేకపోవడంతో రప్పించడం ప్రభుత్వానికి కష్టమైన పనే అంటున్నారు కొందరు. ఆగస్ట్‌లో దుబాయ్‌లో ఇతడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్న ప్రచారం అవాస్తవమని దర్యాప్తు బృందాలు తెలిపాయి.

స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లుగా చేతన్ సందేసరా, నితిన్ సందేసరా, దీప్తిబెన్ సందేసరా ఉన్నారు. వీళ్లు దాదాపు రూ. 5,383 కోట్లు ఎగ్గొట్టారు. రూ.5 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో వీళ్ల ఫార్మాకంపెనీకి చెందిన రూ. 4,701 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎటాచ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 5,000 కోట్ల రూపాయల మేర రుణాలను మంజూరు చేయడంలో ఆంధ్రాబ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ అనూప్‌ ప్రకాశ్‌ గార్గ్‌ పాత్ర ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తూ.. గార్గ్‌‌ను మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేసింది.  

ఈ కుంభకోణంలో స్టెర్లింగ్‌ బయోటెక్ డైరెక్టర్లు చేతన్ సందేసరా, దీప్తిబెన్ సందేసరా, రాజ్‌భూషణ్‌ ఓంప్రకాష్‌ దీక్షిత్‌, నితిన్‌ సందేసరా, విలాస్‌ జోషీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ హేమంత్‌ హాతి, గార్గ్‌లకు వ్యతిరేకంగా సిబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో సందేసరా సోదరులు బినామీ కంపెనీల ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసి గార్గ్‌కు 1.52 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది, సందేసరా సోదరులు అక్రమంగా సంపాదించిన సొమ్మును దేశ విదేశాల్లో ఉన్న 300 బినామి కంపెనీలు, ఖాతాల ద్వారా మళ్లించినట్టుగా ఈడీ ఆరోపిస్తోంది.

Trending News