పాట్నా: సీనియర్ నేత యశ్వంత్ సిన్హా (80) బీజేపీకి పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలం నుంచి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన సిన్హా..పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయి ఈ మేరకు రాజీనామా ప్రకటించారు. ఇదే సమయంలో ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాట్నాలో ఉన్న సిన్హా తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మోడీ సర్కార్ పై విమర్శలు సంధించారు.
యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా కలిసి పొలిటికల్ యాక్షన్ గ్రూప్ ‘రాష్ట్ర మంచ్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర మంచ్ ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్ సిన్హా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్ఎల్‌డీ తదితర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో యశ్వంత్ సిన్హా తన రాజీనామాను ప్రకటించడం విశేషం
రాజకీయ ప్రస్థానం..
బీజేపీకి చెందిన అత్యంత సీనియర్ నేతల్లో యశ్వంత్ సిన్హా ఒకరు. బీజేపీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు తన వంతు కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తించి వాజ్ పేయ్ జమానాలో (2002 -2004 ) ఆయనకు కీలకమైన విదేశంగ శాఖ అప్పగించారు. అంతకు ముందు 1998-2002 మధ్యకాలంలో ఆర్ధిక మంత్రిగా యశ్వంత్ సిన్హా పని చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా బదులు ఆయన కుమారుడు జయంత్ సిన్హా కేబినెట్ లో చోటు దక్కింది. జయంత్ సిన్హా ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా జయంత్ సిన్హా పనిచేస్తున్నారు.