మందలించినందుకు మేనత్తను హతమార్చిన టెన్త్ విద్యార్థి !

                                               

Updated: Aug 6, 2018, 10:40 PM IST
మందలించినందుకు మేనత్తను హతమార్చిన టెన్త్ విద్యార్థి !

తమిళనాడులో సంచలన ఘటన చోటు చేసుకుంది. మందిలించిందనే కారణంతో తన మేనత్తను హతమార్చాడు ఓ టెన్త్ విద్యార్ధి. సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటన  సోమవారం  చెన్నైపట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే  చెన్నైలోని వల్లలార్‌కు చెందిన  శంకర్ సుబ్బు , తమిళ్ సెల్వి  దంపతులకు  కుమారుడు, కుమార్తె ఉన్నారు. పనిపూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన శంకర్  తన భార్యను స్పృహ తప్పిన స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గొంతును ఎవరో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది.  ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా శంకర్ సోదరి కుమారుడైన టెన్త్ చదువుతున్న విద్యార్థి ఆ ఇంటికి వచ్చినట్టు గుర్తించారు.

పోలీసులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటికి వచ్చింది.  తన కూతురిని కలవద్దని మేనత్త ఆంక్షలు విధించిందని.. అందుకే ఈ దారుణానికి వడిగట్టానని నిందితుడు తెలిపాడు. పట్టుమని పదోతరగతి కూడా పూర్తి చేయని ఈ విద్యార్ధిలో ఇంతటి క్రూరమైన ఆలోచన తట్టడంపై స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.