అత్యాచారాలపై అతివ పోరాటం.. ఎవరీ స్వాతి మలివాల్..?

ఆమె వయసు 33 సంవత్సరాలు మాత్రమే.. కానీ గుండె నిండా ఉంది వెయ్యి ఏనుగుల బలం. బాలికలపై, మగువలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆమె చేస్తున్న ఉద్యమం ఇప్పుడు దేశాన్నే ఆకర్షిస్తోంది. 

Last Updated : Apr 20, 2018, 11:14 PM IST
అత్యాచారాలపై అతివ పోరాటం.. ఎవరీ స్వాతి మలివాల్..?

ఆమె వయసు 33 సంవత్సరాలు మాత్రమే.. కానీ గుండె నిండా ఉంది వెయ్యి ఏనుగుల బలం. బాలికలపై, మగువలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆమె చేస్తున్న ఉద్యమం ఇప్పుడు దేశాన్నే ఆకర్షిస్తోంది. "రేప్ రోకో" అని ఆమె గళమెత్తితే చాలు.. కొన్ని వేలమంది విద్యార్థులు, యువత ఆమెకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె పేరే స్వాతి మలివాల్. భారతదేశంలో ఇప్పుడు ఆమె పేరు నిజంగానే ఓ ప్రభంజనం.. ఆమె గళం అలుపెరగని కెరటం.. !

15 అక్టోబరు 1984 తేదిన ఘజియాబాద్ జిల్లాలో జన్మించారు స్వాతి మలివాల్. ఆమె తండ్రి  ఓ స్కూల్ టీచర్. ఆర్మీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుకున్న స్వాతి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివి, హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం కూడా సంపాదించారు. కానీ స్వచ్ఛంద సేవ చేయాలనే ఆశయం ఉండడంతో ఆమె ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 'పరివర్తన' పేరుతో ఓ సంస్థను స్థాపించారు.

ఈ సంవత్సరం జనవరి మొదటి వారంలో 8 నెలల బాలికపై అత్యాచారం జరిగినప్పుడు తొలిసారిగా "రేప్ రోకో" పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు స్వాతి మలివాల్. అదే ఉద్యమంలో భాగంగా ఇటీవలే కథువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికలపై ముష్కరులు అఘాయిత్యానికి  పాల్పడి హతమార్చినప్పుడు... నిరాహారదీక్షకు కూర్చున్నారు ఆమె. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆ దీక్షను ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు. 

స్వాతి మలివాల్ ప్రస్తుతం ఢిల్లీ మహిళా కమీషన్‌కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఆ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా మహిళల సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 12000 కేసులను పరిష్కరించారు. జీబీ రోడ్డు ప్రాంతంలో బాలికల అక్రమ రవాణాను అడ్డుకొని, అందులో ప్రధానమైన నేరస్తులను చట్టం ముందు నిలబెట్టారు. స్వాతి పరిష్కరించిన కేసులలో చెప్పుకోదగ్గ కేసు అది.

అలాగే గతంలో ఆమె జన లోకపాల్ క్యాంపెయిన్‌‌‌లో విరివిగా పాల్గొన్నారు.  సమాచార హక్కు చట్టం పట్ల సామాన్య జనాలకు అవగాహన కల్పించడానికి కూడా
ప్రయత్నించారు. ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రాజ్యాంగ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని.. తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ  నిరాహార దీక్ష చేస్తున్నారు

 

 

Trending News