రాహుల్ 'ప్రధాని' ప్రకటనపై చురకలంటించిన మోదీ

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్నది.

Last Updated : May 10, 2018, 10:09 AM IST
రాహుల్ 'ప్రధాని' ప్రకటనపై చురకలంటించిన మోదీ

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్నది. కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్‌ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుస బహిరంగ సభల్లో పాల్గొంటూ హోరెత్తిస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రోడ్‌షోలతో కన్నడిగులను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.

కోలార్ లోని బంగార్ పేట్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ పార్టీ ఆరు రోగాలతో బాధపడుతున్నదని చెప్పారు. ఆ ఆరు- కాంగ్రెస్ సంస్కృతి, కమ్యునలిజం, క్యాస్టిజం, క్రైమ్, అవినీతి, కాంట్రాక్టర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈ ఆరు 'సీ'ల వల్ల కర్ణాటక భవిష్యత్ ను నాశనం అవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ‘దిల్’ (హృదయం) లేదనీ... వారు కేవలం ‘డీల్స్’తోనే పార్టీని నడిస్తారని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ఒక తోలుబొమ్మ ప్రధానిగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నిజమైన అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్నే కోల్పోతున్నదని, కర్ణాటకలోనూ ఇదే పునరావృతం కానున్నదని ఆయన అన్నారు.

బంగార్ పేట్ ప్రచార సభలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘అపార అనుభవం ఉన్న అనేకమంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. అయినా తానే ప్రధానమంత్రిని అవుతానంటూ ఎలా ప్రకటించుకుంటారు? ఇది అహంకారం తప్ప మరొకటి కాదు..’’ అని పేర్కొన్నారు. రాహుల్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, ఆయనకు ఆ అర్హత, పరిపక్వత లేవని మోదీ అన్నారు. రాహుల్‌ కంటే సీనియర్లు కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది ఉన్నారని ఆయన అన్నారు. సీనియర్లంటే రాహుల్‌కు గౌరవం లేదని ఆయన చెప్పారు. రాహుల్‌కు పేదవాళ్ల కష్టాలు తెలియవని మోదీ అన్నారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరన్నారు.

Trending News