ప్రధాని మోదీతో జీ న్యూస్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ : 10 ముఖ్యాంశాలు

నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాస్తా తీరిక చేసుకుని ప్రముఖ న్యూస్ ఛానెల్ జీ న్యూస్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Last Updated : Jan 21, 2018, 01:36 PM IST
ప్రధాని మోదీతో జీ న్యూస్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ : 10 ముఖ్యాంశాలు

నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాస్తా తీరిక చేసుకుని ప్రముఖ న్యూస్ ఛానెల్ జీ న్యూస్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరి అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారాయన. దేశవ్యాప్తంగా ఎంతోమంది సాధారణ పౌరులు అడగాలనుకుంటున్న ప్రశ్నలు, సందేహాలు, తెలుసుకోవాలనుకుంటున్న అంశాలపై మోదీ ఇచ్చిన సమాధానాలలో పలు ముఖ్యాంశాలు క్లుప్తంగా ఇలా వున్నాయి.

దావోస్ పర్యటనపై మోదీ అభిప్రాయం: 
ప్రపంచ ఆర్థిక భవితవ్యంపై అంతర్జాతీయ స్థాయిలో పేరున్న బిజినెస్ లీడర్స్ తమ అభిప్రాయాలని పంచుకునే వేదికగా దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిలవనుంది. భారత్‌లో శరవేగంగా పైకి దూసుకెళ్తున్న జీడీపీ వృద్ధి రేటు, ప్రజాస్వామ్యం పుణ్యమా అని ప్రపంచదేశాలు భారత్‌తో స్నేహహస్తం కోసం వేచిచూస్తున్న తరుణం ఇది. ఈ నేపథ్యంలో భారత్ అంటే ఏంటో నిరూపించుకునేందుకు దావోస్ ఓ చక్కటి వేదిక.

బడ్జెట్ 2018 వెనుకున్న అజెండా :
జాతీయ అభివృద్ధే తమ సర్కారు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2018 వెనుకున్న ప్రధానమైన అజెండా.

వన్ నేషన్-వన్ ఎలక్షన్:
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, వివిధ తేదీలు, వివిధ సందర్భాలలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖజానాపై ఆర్థికంగా ఎంతో భారం పడుతోంది. అంతేకాకుండా అందుకోసం ఎంతో శ్రమ, మానవ వనరులను వెచ్చించాల్సి వస్తోంది. ఒకవేళ దేశవ్యాప్తంగా అన్నిరకాల ఎన్నికలు ఒకేసారి జరిపినట్టయితే, అన్నివిధాల జరుగుతున్న ఆ వృధా కాస్తా ఆదా అవుతుంది.

నోట్ల రద్దు, జీఎస్టీ:
యూపీఏ సర్కారు హయాంలో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు పన్నుల సమస్యలు, ఆర్థికపరమైన అంశాలని లేవనెత్తాయి. కానీ అప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న యూపీఏ సర్కార్ ఆ అంశాలని పెడచెవిన పెట్టింది. అందుకే తమ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకొచ్చాకా ప్రజాప్రయోజనార్థం అటువంటి ఆర్థిక సంస్కరణలని ముందుకు తీసుకెళ్లాం. 

కేవలం నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను బిల్లు లాంటి అంశాలని ప్రామాణికంగా తీసుకుని తమ సర్కారు పనితీరుని అంచనా వేయడం సరికాదు. బ్యాంకింగ్ రంగంలో తమ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణలు సామాన్యులని అందులో భాగస్వాములయ్యేలా చేశాయి. గతంలో పాఠాశాలల్లో మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వేలాది మంది ఆడపిల్లలు చదువుకి దూరమయ్యారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అది సర్కారు విజయమే కదా!

భారత్‌లో విదేశీ పెట్టుబడులు:
2014కు ముందు భారత్ ఏం చెప్పిందో ప్రపంచదేశాలు పట్టించుకోలేదు. కానీ మేం ( ఎన్డీఏ) ప్రభుత్వంలోకొచ్చాకా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత 30 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పూర్తిస్థాయి మెజారిటీతో ఏర్పడింది. యావత్ ప్రపంచం ఈ పరిణామాన్ని గమనించింది. సార్క్, జీ-20 సదస్సుల సందర్భంగా ఆ తేడాని గమనించాను. ఇప్పుడు ప్రపంచదేశాలు భారత్‌ని ఓ లీడర్‌గా అంగీకరిస్తున్నాయి. భారత్‌లో పారదర్శకమైన, ప్రజారంజకమైన పాలన కోసం జరుగుతున్న కృషిని కూడా ప్రపంచదేశాలు గమనిస్తున్నాయి. అందుకే భారత్‌లో పెట్టుబడులకి ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఉపాధి:
ఒక్క ఏడాదిలో 70లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ముద్ర యోజన పథకం కింద 10 కోట్లకుపైగా మంది లబ్ధి పొందారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా కుటీర పరిశ్రమల్లో వృద్ధి కనిపిస్తోంది. ఉపాధిలో వృద్ధి రేటుకి ఇవి కొన్ని గణాంకాలు మాత్రమే.

పుతిన్-ట్రంప్-మోదీ:
ఎప్పుడైనా వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రపంచనేతల పక్కన నిలబడ్డప్పుడు.. తాను కోట్లాది మంది భారతీయుల ప్రతినిధిగా వాళ్ల సరసన నిలబడ్డాను అనే భావిస్తాను. ఎందుకంటే నాకు ఆ అవకాశాన్ని కలిపించి వాళ్లే కదా.  

అవినీతి:
బ్యూరోక్రసీ మద్దతు లేకుంటే తమ ప్రభుత్వం ఇన్ని విజయాలు సాధించేది కాదేమో! తమ నేతలు జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నారని తెలిసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజల పట్ల బాధ్యతగానే నడుచుకుంటుంది.

ఎన్నికల ప్రచారాల హంగామా :
గుజరాత్‌కి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఎలా ప్రచారంలో పాల్గొన్నానో ఇప్పుడు అలాగే పాల్గొంటున్నాను. ఇందులో కొత్తేం వుంది ? : మోదీ

2019 లోక్‌సభ ఎన్నికలు: 
కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్షే తనని ఈ హోదాలో నిలిచేలా చేసింది. అందుకే రాబోయే ఎన్నికల గురించి ఆలోచించేంత సమయం, తీరిక ఇప్పుడు తన ముందు లేవని బదులిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. 

Trending News