రైలు పెట్టెలపై ఇక రిజర్వేషన్ చార్టులు కనిపించవు

రైలు పెట్టెలపై కనిపించే రిజర్వేషన్ చార్టులు ఇక ఎప్పటికీ కనిపించకుండా పోనున్నాయి.

Last Updated : Sep 3, 2018, 05:30 PM IST
రైలు పెట్టెలపై ఇక రిజర్వేషన్ చార్టులు కనిపించవు

రైలు పెట్టెలపై కనిపించే రిజర్వేషన్ చార్టులు ఇక ఎప్పటికీ కనిపించకుండా పోనున్నాయి. ఈ మేరకు మంగళవారం రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కానీ రైల్వే స్టేషన్‌లలో మాత్రం యథావిధంగా కనిపిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ నెల 1 నుంచే దీన్ని అమలు చేస్తోంది. దేశంలో రోజుకు సగటున 11 లక్షల రైలు టికెట్‌లను విక్రయిస్తుంటే వాటిలో 70 శాతానికి పైగా ఇంటర్నెట్‌లోనే అమ్ముడవుతున్నాయి. రిజర్వేషన్‌లకు సంబంధించిన వివరాలు ఫోన్‌లకు ఎస్ఎంఎస్‌ల రూపంలో వెళ్తుండటం, నెట్‌లో కూడా అందుబాటులో ఉండటంతో.. ఇక మీదట రిజర్వేషన్ చార్టుల అవసరం లేదని రైల్వే శాఖ నిర్ణయించింది.  రోజుకు కొన్ని వేల పేపర్లను ఆదా చేయవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్పటికే సీఎస్టీ, ముంబై సెంట్రల్‌తో సహా అన్ని ప్రధాన స్టేషనల్లో రైల్వే రిజర్వేషన్ చార్టులను రైల్వే కోచ్‌లపై అతికించడం ఆపేశారు. నవంబర్ 2016లో, 'గ్రీన్ ఇనీషియేటివ్'లో భాగంగా, బెంగళూరు, యశ్వంత్పూర్ స్టేషన్ల నుండి వెళ్లే రిజర్వేషన్ కోచ్‌లపై చార్టులను అతికించడాన్ని సౌత్ వెస్టర్న్ రైల్వేస్ బెంగళూరు డివిజన్ నిలిపివేసింది.

'రైల్ సురక్ష' యాప్

రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రైల్వే శాఖ ‘రైల్‌ సురక్ష’ పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ నెలాఖరులో సెంట్రల్‌ రైల్వే పరిధిలో ప్రయాణికులకు ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు యాప్‌లో సమస్య చెబితే.. ముంబైలోని కంట్రోల్‌ రూం(182)కు ఎస్ఎంఎస్ వెళుతుంది. సిబ్బంది వెంటనే ఫిర్యాదుదారుడి ఫోన్‌ ఎక్కడ ఉందో కనుక్కొని దగ్గరలోని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌)లేదా గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ)లను అలర్ట్ చేస్తుంది. దాంతో అధికారులు ఫిర్యాదుదారుడి దగ్గరకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.

Trending News