పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం రావణ దహన వేడుకలు జరుగుతున్న సమయంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కనీసం 61 మంది చనిపోయి ఉంటారని, 70 మంది గాయపడి ఉంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. అయితే ఇంతవరకు మృతుల సంఖ్యపై అధికారికంగా స్పష్టమైన వివరాలేవీ వెల్లడి కాలేదు.
జోదా ఫటక్ ప్రాంతం రైలు పట్టాలకు సమీపంలో శుక్రవారం సాయంత్రం రావణ దహన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బహుశా జనాలు అంచనాలకు మించి రావడంతో రైలు పట్టాలపై నిల్చొని మరీ వేడుకలను వీక్షించారు. ఆ సంతోష సమయంలో జనాలు సెల్ఫోన్లతో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అప్పడే అనుకోకుండా మృత్యువు రైలు రూపంలో వచ్చింది.
నివేదికల ప్రకారం.. రావణ దహన కాష్టం జరుగుతున్న బాణాసంచా పేలుస్తున్నారు. ఆ సమయంలో జనాలు రైలు ట్రాక్‌పై నిల్చొని సెల్ఫీలతో, వీడియోలతో బిజీగా ఉన్నారు. స్వల్ప వ్యవధిలోనే రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. బాణాసంచా శబ్దాలకు రైలు కూత కూడా వినిపించలేదో ఏమో జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. రైలు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మంది అక్కడికక్కడే మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 6:30- 7:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
రెండు ట్రాక్‌లపై స్వల్ప వ్యవధిలో రెండు రైళ్లు వెళ్లడమే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయం విషయం తెలుసుకున్న సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి
రైలు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ రైలు ప్రమాదం ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర హోమ్ శాఖతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ పరిస్థితిని సమీకిస్తున్నారు. అటు కేంద్రం కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది.
అమెరికా పర్యటనలో ఉన్న రైల్వేశాఖమంత్రి పీయూష్ గోయల్ కూడా సంఘటనపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే అమెరికాలో పర్యటనలు రద్దుచేసుకొని ఇండియాకు బయలుదేరారు. రైల్వేశాఖ తక్షణ కార్యక్రమాలు చేపట్టిందని.. అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు.
పంజాబ్ ప్రభుత్వం మరణించిన వారికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పింది.
రైలు ఘటన దురదృష్టకరమని ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పంజాబ్‌లో సివిల్ హాస్పటల్లో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆయన పరామర్శించారు. ఈ ప్రమాదంలో పొరపాటు జరిగిందని, కానీ ఉద్దేశపూర్వంగా ఈ ఘటన జరగలేదన్నారు. కేవలం కొన్ని క్షణాల్లోనే ప్రమాదం జరిగిపోయిందని ఆయన తెలిపారు. రైలు హైస్పీడ్‌లో వచ్చిందని, రైలు హారన్ ఇవ్వలేదని సిద్ధూ అన్నారు.
పలు రైళ్లు రద్దు
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో రైల్వే అధికారులు 8 రైళ్లు రద్దు చేసి, 5 రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అమృత్‌సర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం కారణంగా అధికారులు 8 రైళ్లను రద్దు చేశారు. మరో 5 రైళ్లను దారి మళ్లిస్తున్నారు.