రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వాహనాలకైనా రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి

చట్టం ముందు ఎవరైనా సమానమేనని మరోసారి స్పష్టంచేసిన న్యాయస్థానం

Last Updated : Jul 19, 2018, 11:19 AM IST
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వాహనాలకైనా రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి

చట్టం ముందు ఎవరైనా సమానమే అని తరచుగా కోర్టులు వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఢిల్లీ హై కోర్టు మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసింది. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ అయినా సరే తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని ఢిల్లీ హై కోర్టు స్పష్టంచేసింది. సదరు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌ని వాహనంపై కనిపించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టు తేల్చిచెప్పింది. అత్యున్నత పదవుల్లో ఉండే వారు తమ వాహనాలపై నాలుగు సింహాల చిహ్నాన్ని ప్రదర్శించడానికి బదులుగా రిజిస్ట్రేషన్ నెంబర్‌నే వినియోగించేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

అత్యున్నత పదవుల్లో ఉండే నాయకులు తమ వాహనాలపై నెంబర్లకు బదులుగా నాలుగు సింహాల చిహ్నాన్ని ఉపయోగించడంవల్ల అటువంటి ప్రముఖులపై దాడులకు పాల్పడాలనుకునే ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులకు పని సులువవుతుందని, అది ఆ ప్రముఖుల ఉనికికే ప్రమాదం అని సదరు ఎన్జీఓ తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ లేని కార్ల కారణంగా ఏవైనా ప్రమాదాలు జరిగితే, సదరు ఘటనల్లో బాధితులు చట్టరీత్యా తమ హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలని ఎన్జీఓ వెలిబుచ్చిన సందేహంపై స్పందిస్తూ రాజ్యాంగాధినేతలు ఉపయోగించే వాహనాలకైనా రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి అని కోర్టు స్పష్టంచేసింది.

Trending News