శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించిన భారతీయ గాయని ఇక లేరు

తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో ఇప్పటి వరకూ 500 పాటలు పాడిన నేపథ్యగాయని కె.రాణి ఈ రోజు హైదరాబాద్ కళ్యాణ్ నగర్‌లో తన కుమార్తె ఇంటిలో మరణించారు

Last Updated : Jul 15, 2018, 05:20 PM IST
శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించిన భారతీయ గాయని ఇక లేరు

తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో ఇప్పటి వరకూ 500 పాటలు పాడిన నేపథ్యగాయని కె.రాణి ఈ రోజు హైదరాబాద్ కళ్యాణ్ నగర్‌లో తన కుమార్తె ఇంటిలో మరణించారు. దేవదాసు సినిమాలో బాగా పాపులర్ అయిన “అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ” పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాణి, తొమ్మిదవ ఏట నుంచే సినిమాలలో  పాటలు పాడడం ప్రారంభించారు.

“ఇన్నిసాయ్ రాణి” అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాఙ్ చేత పొగడ్తలను పొందిన ఈమె భారత రాష్ట్రపతి భవన్‌‌లో కూడా కచేరీ చేసిన ఘనతను పొందారు. శ్రీలంక జాతీయ గీతాన్ని తొలిసారి ఆలపించిన ఘనత కూడా రాణికే దక్కింది. తెలుగులో రూపవతి, పెళ్లి చేసి చూడు, ధర్మదేవత, దేవదాసు, కన్నతల్లి, చంద్రహారం, నిరుపేదలు, చెడపకురా చెడేవు, జయసింహ మొదలైన చిత్రాలలో కూడా రాణి పాటలు పాడారు. 

సి ఆర్ సుబ్బురామన్, ఘంటసాల, దక్షిణామూర్తి, టివి రాజు, టిజి లింగప్ప, టి చలపతిరావు, రాజన్ నాగేంద్ర, పెండ్యాల నాగేశ్వరరావు వంటి గొప్ప సంగీత దర్శకుల వద్ద కూడా రాణి గీతాలను ఆలపించారు. 1951లో గాలివీటి సీతారామిరెడ్డిని పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత సినిమాల్లో అడపా దడపా మాత్రమే సినిమాల్లో రాణి పాటలు పాడేవారు. ఆ తర్వాత పూర్తిగా తన కెరీర్‌‌కు స్వస్తి పలికారు.

జిక్కి, సుశీల, జమునా రాణి వంటి సింగర్స్‌తో కలిసి కూడా రాణి డ్యూయెట్స్ పాడారు. తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రచార గీతాలు కూడా రాణి పాడారు. అలాగే తమిళంలో పలు ముస్లిం కవ్వాలీలు కూడా పాడారు. స్టేజి షోలలో కూడా పలుమార్లు హిందీ పాటలు పాడారు రాణి. ఆమె పాడిన "ఓ మైనే ప్యార్ కియా", "మై క్యా ఖరూ రామ్.. ముఝే బుడ్డా మిల్గయా" వంటి హిందీ పాటలను విని స్వయానా రాజ్ కపూర్ ఆమె వద్దకు వచ్చి అభినందనలు తెలియజేశారట. 1965లో తెలుగులో విడుదలైన "విశాల హృదయాలు" చిత్రంలో రాణి చివరిసారిగా తన పాటలు పాడారు. మరణించే నాటికి ఈ మేటి గాయని వయసు 75 సంవత్సరాలు. 

Trending News