నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అహ్మదాబాద్‌లోని ఓ విద్యాలయంలో ఇద్దరు అంధ విద్యార్థినులు తమ నాట్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే వారు నాట్యానికి ఓ ప్రత్యేకమైన గీతాన్ని ఎంచుకున్నారు. "గూమే ఆనే గర్బో" అంటూ సాగే ఆ గీతాన్ని దాదాపు 25 సంవత్సరాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ రచించారట. ప్రస్తుతం అంధ విద్యార్థినులు ఈ పాటకు నాట్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. గుజరాతీ భాషలో సాగే ఈ గీతం ఓ ఆల్బమ్ ద్వారా విడుదల కాగా.. ఐశ్వర్య మజుందార్, అమి పారేఖ్ ఆ పాటకు స్వరకల్పన చేశారు.
తాజాగా.. తన పాటకు అంధ విద్యార్థినులు నాట్యం చేశారన్న విషయం తెలుసుకున్న మోదీ కూడా స్వయంగా ట్విట్టర్‌లో వారిని ఆశీర్వదించారు. "ఈ నాట్యం చూసి నేను ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. గర్బా నాట్యం ఆ కుమార్తెల జీవితంలో స్ఫూర్తిని నింపింది" అని ఆయన తెలిపారు. గర్బా అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన సంప్రదాయక నాట్యం. అనేక కుటుంబాలు కూడా తమ ఇళ్లల్లో జరిగే పండగలకు.. ఆ నాట్యాన్ని తప్పనిసరిగా ప్రదర్శిస్తుంటాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రచయితగా కూడా సుపరిచితులే. సోషల్ హార్మనీ, జ్యోతిపుంజ్, ఇండియాస్ సింగపూర్ స్టోరీ, మన్ కీ బాత్ - ఏ సోషల్ రివల్యూషన్ ఆన్ రేడియో, ఏ జర్నీ - పొయెమ్స్, ఎగ్జామ్ వారియర్స్ వంటి పుస్తకాలను ఆయన రచించారు. మోదీ ఈ మధ్యకాలంలో రచించిన "ఎగ్జామ్ వారియర్స్" పుస్తకం పిల్లల్లో పరీక్షల పట్ల భయాన్ని పారద్రోలి.. వారికి చదువుపై ప్రేమను కలిగించే మార్గాలను సూచిస్తుంది.
#WATCH Visually challenged girls performed a song which was written by PM @narendramodi pic.twitter.com/VVHbKrgwnc
— ANI (@ANI) October 13, 2018