'కరోనా వైరస్'పై భుజం భుజం కలిపి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు రెండో దఫా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు ఏం చేద్దాం.. ? ఎలాంటి చర్యలు తీసుకుందాం.. ? అని ప్రధాని మోదీ చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు. లాక్ డౌన్ పొడగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు ప్రధాని. ఈ క్రమంలో ఆయన తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. లాక్ డౌన్ పొడగింపు నిర్ణయం తీసుకున్నాయి. మే 1 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు రెండు ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతే కాదు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. మరోవైపు తెలంగాణ కూడా లాక్ డౌన్ పొడగింపునకే మొగ్గు చూపుతోంది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఇదే అంశాన్ని ఆయన ప్రధాని మోదీకి తెలిపే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో కొత్తగా కనిపించారు. ఆయన ఇంట్లో తయారు చేసిన మాస్క్ ధరించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా ముఖానికి మాస్కులు ధరించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం విశేషం.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 7 వేల 447 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 6 వేల 565 మంది చికిత్స తీసుకున్నారు. ఇప్పటి వరకు 643 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 239 మంది మృతి చెందారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
భుజం భుజం కలిపి పోరాడదాం..!!